AP: సరిహద్దులు దాటిన ఏపీ హస్త కళల వైభవం

ఆంధ్రప్రదేశ్ హస్తకళల వైభవం మరోసారి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్రానికి చెందిన సంప్రదాయ కళారూపాలు దేశ సరిహద్దులను దాటి విదేశాల్లోనూ ఆదరణ పొందుతున్నాయి. తాజాగా సింగపూర్‌లోని భారత హైకమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన లేపాక్షి సంస్థకు భారీ ఆర్డర్ ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా మారింది. ఏకంగా 400 గిఫ్ట్ బాక్సులను లేపాక్షి నుంచి ఆర్డర్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల్లో, హస్తకళల రంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే, జనవరి 26న సింగపూర్‌లోని భారత దౌత్య కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల దౌత్యవేత్తలు, ప్రముఖులు, భారతీయ సమాజానికి చెందిన ముఖ్య ఆహ్వానితులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అతిథులకు ప్రత్యేకంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బహుమతులు అందించాలని భారత హైకమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లేపాక్షి గిఫ్ట్ బాక్సులను ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది. గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఎంపిక చేసిన ఈ గిఫ్ట్ బాక్సుల్లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల నైపుణ్యం స్పష్టంగా ప్రతిబింబించే కళారూపాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సీతాదేవి లెదర్ పప్పెట్రీ, సంప్రదాయ శైలిలో రూపొందించిన ఏనుగు ఆకారపు బ్యాగేజ్ ట్యాగ్, హ్యాండ్ పెయింటెడ్ కోస్టర్లు వంటి ప్రత్యేక వస్తువులు ఈ గిఫ్ట్ బాక్సుల్లో ఉండనున్నాయి. ఇవన్నీ రాష్ట్ర కళాకారుల చేతితో తయారైనవే కావడం గమనార్హం. ఈ కళారూపాలు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయం, సంస్కృతి, కళా వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పనున్నాయి. ఏపీ హస్తకళలకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఏపీ హస్తకళల గిఫ్ట్ బాక్స్ అందజేయాలని భారత్ హైకమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. హస్తకళలకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి తెలిపారు. కళారూపాల తయారీలో ఆధునిక హంగులు అద్దేలా కళాకారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. విశాఖపట్నం, అనంతపురం, కడప సహా ప్రధాన కేంద్రాల్లోని 15 షోరూంలను ఆధునీకరించడం జరిగిందని వెల్లడించారు. త్వరలోనే ఇతర దేశాల్లోనూ లేపాక్షి షోరూంల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూంల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. విశాఖ, అనంతపురం, కడప వంటి ప్రధాన కేంద్రాలతో పాటు మొత్తం 15 లేపాక్షి షోరూంలను ఆధునీకరించినట్లు వెల్లడించారు.
సింగపూర్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు వచ్చిన ఈ భారీ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ హస్తకళల రంగానికి మైలురాయిగా నిలుస్తోంది. ఇది రాష్ట్ర కళాకారుల శ్రమకు, ప్రతిభకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా భావించవచ్చు. రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని అవకాశాలు లభిస్తే, ఆంధ్రప్రదేశ్ హస్తకళలు ప్రపంచవ్యాప్తంగా మరింత వెలుగొందనున్నాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
