రేపే మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు

రేపే మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు
మొత్తంగా రేపటితో పుర పోరులో గెలుపెవరిదో తేలిపోనుంది.

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లతో లెక్కింపు ప్రారంభం అవుతుంది. విశాఖ కార్పొరేషన్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరగనుంది. విశాఖలో ఎనిమిది జోన్లు ఉండగా ఒక్కో జోన్‌కు ఒక్కో బిల్డింగ్ కేటాయించారు. మొత్తం 98 వార్డులకు 98 గదుల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా.. ఉదయం 8 గంటలకు బ్యాలెట్‌ బాక్సుల్ని తెప్పించి 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టుకుంటూ వెళ్తారు. అన్ని వార్డుల్లోనూ ఈ ప్రక్రియ పూర్తవటానికి మధ్యాహ్నం 12 అవుతుందని అంచనా వేస్తున్నారు.

భోజనానికి ముందే ఒక రౌండ్‌ లెక్కింపు పూర్తి చేయాలనుకుంటున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజన విరామ సమయాలను కలుపుకుంటే ఉదయం 8 గంటలకు మొదలయ్యే లెక్కింపు దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో కొన్ని ఇరుకు గదుల కారణంగా ఫలితం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 3వ రౌండ్‌కు వెళ్లిన వార్డులన్నీ ఇలా ఉన్నవే కనిపిస్తున్నాయి. రెండో రౌండ్‌లోనే లెక్కింపు అయిపోవాల్సి ఉండగా సరిపడా టేబుళ్లు పట్టే స్థలం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇక 10, 11, 12 వార్డుల లెక్కింపు గదుల్లో కేవలం 5 టేబుళ్లు మాత్రమే పట్టాయి. ఒక్కోవార్డులో 10 వేలకు పైగా పోలైన ఓట్లుండటంతో ఫలితం కోసం మూడో రౌండ్‌ వరకూ వేచి ఉండాలి.

విజయవాడ కార్పొరేషన్‌ ఓట్లను ఉదయం 7 గంటల నుంచే లెక్కించడం మొదలుపెడతారు. లయోల కాలేజీలోని రెండు బ్లాకుల్లో మొత్తం 64 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 23 కౌంటింగ్‌ హాళ్లు, 176 టేబుళ్లతో మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మొదటి రెండు రౌండ్లలో 46 డివిజన్ల ఫలితాలు వస్తాయి. మూడో రౌండ్లో 18 డివిజన్ల ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే 830 మంది కౌంటింగ్‌ సిబ్బందిని నియమించి శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.

గుంటూరు కార్పొరేషన్‌లో 57 డివిజన్లకు ఒకటి ఏకగ్రీవం కాగా 56 డివిజన్లలోనే ఎన్నికలు జరిగాయి. గుంటూరు కార్పొరేషన్‌కు సంబంధించి నల్లపాడులోని ఎంబీటీఎస్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో 34 డివిజన్లు, లయోల పబ్లిక్‌ స్కూల్‌లో 22 డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గుంటూరు కార్పొరేషన్‌లోని 56 వార్డుల్లో 521 పోలింగ్‌ బూత్‌లలో ఓటింగ్‌ జరిగింది. ఇందుకోసం 521 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 584 కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 1,753 సహాయకులను నియమించారు.

తిరుపతిలో 27 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరిగిన 131 పోలింగ్‌ కేంద్రాల్లోని 131 బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను లెక్కించేందుకు 180 మంది సూపర్‌వైజర్లు, 480 మంది సహాయకులను నియమించారు. మొత్తంగా రేపటితో పుర పోరులో గెలుపెవరిదో తేలిపోనుంది.


Tags

Next Story