AP: పోలీసు అధికారులకు బిగుస్తున్న ఉచ్చు

రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి, వారు చెప్పినట్టల చేస్తే తరువాత ఇబ్బందులు పడేది ప్రభుత్వ అధికారులే. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్విడ్ ప్రో కేసులో ఎంతమంది ఐఏఎస్ అధికారులు బలై... జైలు జీవితం గడిపిన విషయం మరచిపోక ముందే ఇప్పడు ఓ తప్పుడు కేసులో ముంబై సినీ నటి కాదంబరీ జత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు.
డీజీపీ ఆదేశాలతో విజయవాడ ప్రస్తుత పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసుకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు తేల్చారు. ఈ నివేదికను డీజీపీకి అందజేశారు. పోలీసు అధికారులపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా నిజాలు నిగ్గు తేల్చేందుకు సీసీఎస్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి, నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు.
నేడు విజయవాడకు జత్వానీ
ముంబై నటి కాదంబరీ జత్వానీ.. నేడు విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబును కలిసి తనపై జరిగిన దాడులు, ఎవరెవరు ఇందులో ఉన్నారన్న పూర్తి వివరాలు తెలపనున్నారు. అలాగే జత్వానీ నుంచి విచారణ అధికారి స్రవంతి రాయ్ వివరాలు రాబట్టనున్నారు. గతంలో జత్వానీపై నమోదైన ఫోర్జరీ కేసును కూడా పరిశీలించనున్నారు. ‘ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి.. అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి, మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్టు చేయడం, ఇలా కేసును స్పీడప్ చేయడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. విజయవాడలోని జిల్లా కారాగారంలో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులు 42 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వచ్చి ముంబైలో కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జత్వానీ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ ముంబైలో జిందాల్‌పై జత్వానీ పెట్టిన కేసును ఉపసంహరించేలా ఒత్తిడి కోసమే ఈ కేసు నమోదు చేశారని.. ఏ మాత్రం సంబంధం లేని వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించడం దారుణమని అన్నారు. ఈ కేసులో అప్పట్లో పోలీసులు ప్రవేశ పెట్టిన సాక్షులను పిలిపించి విచారించనున్నారు. కారాగారంలోని సీసీ కెమెరాల్లో రికార్డయిన వాటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. తప్పు చేసింది సామాన్యులైనా.. ఐపీఎస్ అధికారులైనా చట్టం ముందు అందరూ సమానమే. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని సీపీ రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com