AndhraPradesh: బంగారుపాళ్యం ఘటనపై డీజీపీకి వర్ల లేఖ

బంగారుపాళ్యం ఘటనపై టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. డీజీపీ నిర్దేశించిన ప్రకారం లోకేష్ పాదయాత్రలో పోలీసులు సక్రమంగా పనిచేయడం లేదని లేఖలో ఆయన పేర్కొన్నారు. కొందరు పోలీసు అధికారులు అధికారపార్టీతో కుమ్మక్కై యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. లోకేష్ పాదయాత్ర బంగారుపాళ్యం చేరుకోగానే కరెంట్ కట్ చేశారన్నారు. మూడు వాహనాలు సైతం సీజ్ చేశారన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి నాయకత్వంలో పోలీసులు యువగళం వాలంటీర్లను హింసిస్తున్నారని, బండబూతులు తిడుతూ బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేస్తున్నారన్నారు. గజేంద్ర అనే వాలంటీర్‌పై పలమనేరు ఎస్సై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని, గజేంద్ర రక్తపు గాయాలతో కిందపడిపోయాడని లేఖలో పేర్కొన్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి, అక్రమంగా సీజ్ చేసిన వాహనాలను వెంటనే విడుదల చేయాలని రామయ్య తెలిపారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసుల్ని ఆదేశించాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com