AndhraPradesh : ముందు నుయ్యి... వెనుక గొయ్యి....

AndhraPradesh : ముందు నుయ్యి... వెనుక గొయ్యి....
ముందస్తు పై సంకటంలో జగన్...

మందుస్తు ఎన్నికలు... ఏపీలో ఇప్పడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్.. ఏపీలో ఎన్నికలు 2023లోనా ? 2024 లోనా ? ముందుగా వెళ్తే బెటరా ? ఆన్ టైం వెళ్తేనే మంచిదా? ఈ సంగతి తేల్చుకోలేక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తెగ మథన పడిపోతున్నారట. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు 2024 మే వరకు పాలించమని అధికారం అప్పగించారు. అయితే అప్పటిదాకా బండి లాగగలనా అనే భయం ముఖ్యమంత్రి జగన్ ను పట్టి పీడిస్తోంది.


వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న అసంబద్ద నిర్ణయాలతో ఏపీ పీకలోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపులు సకాలంగా జరగడం లేదు. కొన్ని శాఖల్లో ఉద్యోగులు నెలాఖరుకు జీతాలు అందుకునే దుస్థితి. జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ మార్గాలన్నీ మూసుకుపోయాయి. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు వచ్చి ఎకానమీ పెరిగే స్థితిని చేతులారా చిదిమేశారు.


ఏపీకి కల్పతరువు లాంటి అమరావతి రాజధానిని చంపేశారు. పీపీఏల రద్దు తో మొదలై అమరరాజాను తరిమేసే వరకు అన్నీ వినాశకర నిర్ణయాలే. వివిధ రూపాల్లో ఛార్జీలు, పన్నులు బాదుతుండడంతో జీఎస్టీ వసూళ్ళు మాత్రం బాగానే వస్తున్నాయి. సహజవనరుల మీద సర్కారుకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడింది. ప్రకృతి వనరులను కొల్లగొట్టడం ద్వారా అవన్నీ నేతల సొంత ఖజానాకు మళ్ళిపోతున్నాయి.


జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బండి ఈమాత్రం నడుస్తోందంటే రెండే కారణాలు. ఒకటి అప్పులు. రెండోది మోడీ ప్రభుత్వ సహకారం. ఈరెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా జగన్ ఎప్పుడో చేతులెత్తేసేవారు. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ప్రభుత్వం కూడా సాహసించనంతగా జగన్ సర్కారు రుణ సమీకరణ చేస్తోంది. ఇందుకోసం దేనికైనా సిద్దమంటోంది. ప్రభుత్వ భవనాల తాకట్టు, మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా చూపి అప్పు తెచ్చుకోవడం ఇలాంటివెన్నో...



ఇలా ఎడా పెడా చేసిన అప్పులతో ప్రస్తుతం ఏపీ రుణభారం దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అనేక దేశాల రుణ భారం కంటే కూడా రెండు,మూడు రెట్లు ఎక్కువ. అనేక సందర్బాల్లో ఏపీ సర్కారు పరిమితికి మించి రుణాలు తీసుకున్నా ఏదో ఒక కొత్త మార్గాన్ని ఎంచుకునేందుకు కేంద్రం సహకరిస్తోంది. మోదీ, జగన్ ల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణం. తాజాగా జరిగిన ప్రధాని, సీఎం భేటీలోను రుణాలదే ప్రధాన ఎజెండా .



అయితే ఇప్పటికే హద్దులు దాటిపోయిన నేపథ్యంలో ఇకపై కేంద్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇప్పుడు అమలవుతున్న పథకాలకు నిధులు సమీకరించగలిగే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో 2023 బడ్జెట్ ప్రవేశపెట్టాక అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం ఒక ఆప్షన్. ఇప్పటిదాకా పథకాలు అపకుండా ఇచ్చానని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లి గెలుద్దామనే ప్లాన్.



నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. 400 రోజులపాటు 4000కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. యువగళం పేరుతో సాగే యాత్ర ద్వారా టీడీపీ యూత్ ను అట్రాక్ట్ చేయబోతోంది. ఇటు పవన్ కల్యాణ్ కూడా 2023 మార్చి లేదా మే నుంచి వారాహి యాత్ర చేపట్టబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నియోజకవర్గాల వారీ సభలకు జనం విరగబడుతున్నారు. వీటికి లోకేష్, పవన్ యాత్రలు తోడైతే తట్టుకోలేమనే భయం ఏర్పడింది. వీళ్లకి అవకాశం లేకుండా ముందే ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనేది కూడా మరో వ్యూహం.


ముందస్తు ఎన్నికల్లో ఒక వేళ మళ్లీ గెలిస్తే వచ్చాక పథకాలన్నీ అటకెక్కించి ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడవచ్చుననేది ఎత్తుగడ. అయితే ఏపీ జనం జగన్ కంటే తెలివిమీరి ఉన్నారు. జగన్ మళ్ళీ గెలిస్తే పథకాలన్నీ ఎత్తేస్తారనే విషయంలో ప్రజలకు కూడా స్పష్టత ఉంది. ఇప్పటికే సోషల్ ఆడిట్ పేరిట వేలాదిగా వృద్దాప్య, వితంతు ఫించన్లు తొలగిస్తున్నారు. వీరంతా గడపగడపలో తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఎమ్మెల్యేలు దాని ఫలితాన్నీ అనుభవిస్తున్నారు. కాబట్టి ముందస్తు గా ఎన్నికలకు వెళ్ళి ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదనే భయం కూడా వైసీపీ లో ఉంది.


తొందరపడితే ఉన్న ఏడాది అధికారాన్ని వదులుకున్నట్లవుతుందేమోననే భయం వెంటాడుతోంది. అలాగని మరో ఏడాది పాటు ఈ పథకాలను అమలు చేస్తూ, జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక రకంగా ముందు నుయ్యి, వెనుక గొయ్యి పరిస్థితి. ఇటీవల ప్రధానితో భేటీ అయినప్పడు తన అశక్తతను మోడీ ముందు చెప్పుకున్నట్లు భోగట్టా. ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం అంటే పాలన చేతకాక వదిలేయడమేనని తేలిపోతుంది. ఇప్పటికే ఏపీ ప్రజలు ఎప్పుడు ఎన్నికలొస్తే అప్పుడు వైసీపీ సర్కారుని సాగనంపేందుకు సిద్దమవుతున్నారు. కాబట్టి ఏమైతే అదవుతుందనుకుని ఉన్న మరో ఏడాది కాలం కూడా అధికారం అనుభవించి 2024లో సాధారణ ఎన్నికలకు వెళ్ళడమే ఉత్తమమనేది ఎక్కువమంది వైసీపీ నేతల మనసులో మాట. ఇందుకోసం ప్రధానిని బతిమలాడుకుని వచ్చే ఏడాది కూడా రుణాల సర్దుబాటుకు ప్రయత్నించాలనేది జగన్ తాజా ఆలోచనగా చెబుతున్నారు.

రావిపాటి....

Tags

Read MoreRead Less
Next Story