AP: వైసీపీ దాడులపై పోలీసులు స్పందించరేం?

AP: వైసీపీ దాడులపై పోలీసులు స్పందించరేం?
వరుస దాడులు చేస్తున్నా అదే నిర్లక్ష్యం... నామమాత్రపు సెక్షన్లతో సరి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు, మేధావులు, పౌరసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్నమాట మాట్లాడినా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. అదే అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు...విపక్షాలతో పాటు ప్రశ్నించిన వారందిరిపైనా దాడులకు తెగబడ్డా, వారిని అంతంచేసేందుకు యత్నించినా అత్యధిక సందర్బాల్లో కేసులే పెట్టని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో కేసులు పెట్టినా నామమాత్రపు సెక్షన్లతో మమ అనిపిస్తున్నారు. పోలీసుల అండతో రెచ్చిపోతున్న అధికార మూకలు ఏకంగా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపైనే నేరుగా భౌతికదాడులకు దిగుతున్నారు.ఇంత జరిగినా పక్షపాత వైఖరిని వీడని పోలీసులు మీడియాపై దాడి చేసిన వారిపైనా నామమాత్రపు కేసులతోనే సరిపెడుతున్నారు.

కర్నూలులోని ఈనాడు కార్యాలయం.పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు 250 మందికిపైగా వైసీపీ గూండాలు...కార్యాలయంపై దాడికి దిగారు.రాళ్లు, కర్రలతో సుమారు గంటన్నరపాటు తీవ్ర విధ్వంసం సృష్టించారు.ఆస్తి నష్టం నేరం కింద కేసుతో సరిపెట్టేశారు. ఒక్క వ్యక్తిని మాత్రమే నిందితుడిగా పేర్కొన్నారు. 24 గంటలవుతున్నా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు.పథకం ప్రకారమే ఎమ్మెల్యే అనుచరులైన వైసీపీ గూండాలు నేరపూరిత కుట్రకు రూపకల్పన చేసి.. ఈనాడు కార్యాలయంపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. కార్యాలయం తాళాలు పగలకొట్టేందుకు యత్నించారు. సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమై ‘ఈనాడు ’ కార్యాలయానికి తాళాలు వేసి బయటకు వెళ్లటంతో ముప్పు తప్పింది.లేదంటే ఆ మూక.. విలేకరులపైన దాడికి పాల్పడి వారి ప్రాణాలకు హాని కలిగించి ఉండేది.ఇంత తీవ్ర విధ్వంసానికి పాల్పడితే కేవలం 50 రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఆస్తి నష్టం నేరం కింద కేసు పెట్టి సరిపెట్టేశారు మన పోలీసులు.


అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ నెల 18న జరిగిన ‘సిద్ధం ’ సభ కవరేజీలో ఫొటోలు తీస్తున్న ‘ఆంధ్రజ్యోతి ’ ఫొటో జర్నలిస్ట్‌ శ్రీకృష్ణపై....వైకాపా గూండాలు అత్యంత ఆటవికంగా దాడికి తెగబడ్డారు. వైసీపీ జెండాలు కట్టి ఉన్న కర్రలతో సభా వేదిక నుంచి దాదాపు అరకిలోమీటరు వరకూ ఆయన్ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఆయన్ను అంతమొందించేందుకు యత్నిస్తుంటే పోలీసులు కళ్లప్పగించి చూశారు. దాడి చేసిన వైకాపా నాయకులెవరో ఆ ఫొటోల్లో, వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ఇప్పటి వరకూ పోలీసులు కేవలం ఒక్కర్నే, అది కూడా చాలా ‘గౌరవంగా ’ అరెస్టు చేశారు.

గత నెల 7న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కవరేజికి వెళ్లిన ‘ఈనాడు ’ ఫొటోగ్రాఫర్‌ సంపత్, ‘న్యూస్‌టుడే ’ విలేకరులు ఎర్రిస్వామి, భీమప్ప, ‘ఈటీవీ ’ విలేకరి మంజునాథ్‌పై...వైసీపీ 150 మంది దాడి చేశారు. వెంబడించి మరీ పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు పక్కనే ఉన్నా వారిని నిలువరించలేదు. కేసు నమోదు చేసినా ఒక్కర్నీ అరెస్టు చేయలేదు. తాడిపత్రిలో 2022 జూన్‌ 11న వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి ఓ గుత్తేదారుపై దాడి చేస్తుంటే చిత్రీకరించినందుకు.. ‘న్యూస్‌టుడే ’ విలేకరి ఎర్రస్వామిపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదై ఏడాదిన్నరవుతున్నా ఇప్పటికీ ఎవర్నీ అరెస్టు చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story