CMS MEET: సుహృద్భావ వాతవరణంలో భేటీ
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ సుహృద్భావ వాతవరణంలో జరిగింది. భేటీ సందర్భంగా చంద్రబాబునాయుడు-రేవంత్‌రెడ్డి ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తమ మంత్రులు, అధికారులను పరిచయం చేయగా.. చంద్రబాబునాయుడు ఏపీ మంత్రులు, అధికారులను పరిచయం చేశారు. అనంతరం రెండు గంటలపాటు సమావేశం సామరస్యంగా జరిగింది. అనుకున్న సమయం కంటే ముందే రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. రేవంత్ వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వచ్చారు. ఆరు గంటలకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు చేరుకున్నారు. ఆయనకు రేవంత్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. భట్టి, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ కూడా చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందించారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశంలో తొలుత చంద్రబాబును శాలువాతో సత్కరించిన రేవంత్.. ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. చంద్రబాబు సైతం రేవంత్, భట్టి విక్రమార్కలను శాలువాలతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమలను అందజేశారు.
ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటాయని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలిపారు. అక్కడ పరిష్కారమవని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఈ రెండంచెల్లో అంగీకారం కుదిరిన అంశాలకు ఇద్దరు సీఎంలు ఆమోదముద్ర వేయాలని నిర్ణయించారు. అధికారులు, మంత్రుల కమిటీల్లో తేలని అంశాలను ముఖ్యమంత్రుల వద్ద చర్చించి పరిష్కారం కనుగొనాలని అంగీకారానికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సమస్యలు పెండింగులో ఉండడం వల్ల తెలంగాణకు ఇబ్బందులున్నాయని రేవంత్ తెలిపారు. చంద్రబాబునాయుడు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని లేఖ రాయడం ఆనందం కలిగించిందన్నారు. ప్రపంచంలో చర్చలతో పరిష్కారం కానిదేదీ ఉండదని... ఆ దిశగా కలిసి నడుద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. కృష్ణా నీటి పంపకాలపై కేంద్రంతో మాట్లాడుదామని ఏపీకి రేవంత్ పిలుపునిచ్చారు.
గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు చాలా సున్నితమైనవని. .వారి సెంటిమెంట్‌ను గౌరవించేలా నడుచుకుందామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com