ANGANWAADI: అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి కసరత్తు

తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియామక విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలను భర్తీ చేయనున్నారు, దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపడతాయి. అంగన్వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీల వివరాలను సేకరించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలు ఉన్నట్లు లెక్కతేలింది. నియామక విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సర్కార్ దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సిబ్బంది కొరత వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. టీచర్లు లేనిచోట విద్యార్థులకు పూర్వప్రాథమిక విద్య అందడం కాష్టసాధ్యంగా మారింది. మొత్తం 15,274 ఖాళీలు ఉండగా.. వీటిలో 2,999 టీచర్ పోస్టులు, 12,275 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రాల విధానాలపై అధ్యయనం
అంగన్వాడీ సిబ్బంది నియామకానికి సంబంధించి ఇతర దక్షిణాది రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి శిశు సంక్షేమ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్హతతో పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి అదనంగా ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. కర్ణాటకలో 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు కన్నడ భాషలో ప్రావీణ్యం ఉండాలి. ఈసీసీఈ, నర్సరీ లేదా ఎన్టీటీ డిప్లొమా వంటి అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కేరళలో ఐసీడీఎస్ అధికారులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, మెరిట్ ఆధారంగా స్థానిక మహిళలను ఎంపిక చేస్తున్నారు. తమిళనాడులో ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు. వర్కర్‌కు ఇంటర్, హెల్పర్‌కు పదో తరగతి అర్హతలుగా ఉన్నాయి. మెరిట్ ఆధారంగా నియామకాలు జరుగుతాయి. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రస్తుత నియామక విధానంలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com