ANITHA: వైసీపీకి "వి వి గన్" అని పేరు పెట్టుకోండి

ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. అధికార పక్షం–ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, ప్రతియారోపణలు మరింత ముదురుతున్న వేళ, హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విధానం అభివృద్ధి కంటే విధ్వంసానికే ప్రతీకగా మారిందని ఆమె విమర్శించారు. వైసీపీ నినాదాలు ప్రజల ప్రయోజనాలకు కాకుండా హింసాత్మక రాజకీయాలకు దారితీస్తున్నాయని అనిత ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఉన్న ఫ్యాన్ గుర్తు తీసేసి గొడ్డలి పెట్టుకోవాలని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు చేయడం సరైంది కాదని సూచించారు. అధికార దాహంతో తండ్రి మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారని, తల్లి, చెల్లిని అవమానకర పరిస్థితుల్లోకి నెట్టారని జగన్పై ఆరోపించారు. ప్రజలు ఈ అంశాలను గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. ఇదే సమయంలో కడప జిల్లా ఖాజీపేటలో చోటుచేసుకున్న కీర్తన హత్య ఘటనపై కూడా హోంమంత్రి స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పోలీసుల ఒత్తిడి కారణంగా నిందితులు భయంతో పారిపోవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకుంటుందని, న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె వెల్లడించారు.
రాజకీయ స్వార్థం కోసం కన్నతల్లిని, చెల్లెలిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని సైతం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారని ఆమె ఆరోపించారు. విభజన సమయంలో సోనియా గాంతో లాలూచీ పడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారన్నారని తెలిపారు. తన కోసం పాదయాత్ర చేసిన షర్మిలను సైతం పక్కన పెట్టడం ఆయన నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. తన ఐదేళ్ల పాలనలో విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డారని , ఆ దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని హోంమంత్రి అనిత విమర్శించారు. వైసీపీకి "వి వి గన్" అని పేరు మార్చుకుంటే బాగుంటుందని అనిత సలహా ఇచ్చారు. ప్రజలకు సినిమా చూపిస్తానన్న జగన్‌కు, ఎన్నికల్లో ప్రజలే అసలైన సినిమా చూపించారని ఆమె ఎద్దేవా చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
