Jethwani: జెత్వానీ కేసులో మరో తప్పుడు కేసు

Jethwani: జెత్వానీ కేసులో మరో తప్పుడు కేసు
X
కాదంబరి ఐ ఫోన్లను తెరిపించేందుకు మరో కుట్ర... ఆగ మేఘాలపైన కదిలిన ఐపీఎస్ లు

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మరో మలుపు తిరిగింది. ఆమెకు సన్నిహితుడైన అమిత్‌సింగ్‌ను అరెస్టు చేయడానికి.. ఆమెపైన పెట్టినట్లే ఆయనపైనా తప్పుడు కేసు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఆమెపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను దోషిగా నిలబెట్టడం కోసం ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఇప్పుడీ కేసు దర్యాప్తు జరుగుతుండగా.. నాడు పోలీసులు నమోదు చేసిన మరో తప్పుడు కేసు వివరాలు తెలిశాయి. ఈ కేసు నమోదుకు పోలీసు అధికారులు విజయవాడ పటమట పోలీసు స్టేషన్‌ను ఎంచుకున్నారు. జెత్వానీని ఫిబ్రవరి 3న ముంబై నుంచి తీసుకొచ్చిన తర్వాత నాలుగో తేదీన విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో ఆమె, ఆమె తండ్రి నరేంద్రకుమార్‌, తల్లి ఆశ జిల్లా జైలుకు వెళ్లారు. పోలీసులు వారిని పదో తేదీన కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు కాదంబరిని విచారించారు. అరెస్టు సమయంలో ఆమెకు సంబంధించిన ఐదు యాపిల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్న ఆధారాలను తుడిచేయడానికి పాస్‌వర్డ్‌లు చెప్పాలని ఆమెపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అయితే ఆమె ఆ వివరాలు వెల్లడించలేదు. ఎంత ఒత్తిడి చేసినా ఆమె పాస్‌వర్డ్‌లు చెప్పడం లేదన్న విషయాన్ని పోలీసులు విద్యాసాగర్‌కు చేరవేశారు.

విద్యాసాగర్ ఆదేశించాడు.. వీళ్లు ఆచరించారు..

తన ఫోన్లను ఫోన్లను తెరిచేందుకు కాబందబీ జెత్వానీ అస్సలు అంగీకరించలేదు. ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్‌కుమార్‌ సింగ్‌ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్‌ ఓపెన్‌ చేస్తుందని కాంతిరాణా, విశాల్‌ గున్నీలకు విద్యాసాగర్‌ సలహా ఇచ్చారు. విద్యాసాగర్‌ సలహా మేరకు.. కాంతిరాణా ఓ ప్రణాళికను అమల్లో పెట్టారు. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 10న పటమట పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులతో దాడి చేయించారు. ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమెను ఈ కేసులో ఏ1గా చేర్చి కేసు నమోదుచేశారు. ఏ2గా.. కాదంబరీ జెత్వానీకి సన్నిహితుడైన అమిత్‌కుమార్‌ సింగ్‌ను చేర్చారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదుచేశారు.

ఈ తప్పుడు కేసును అడ్డుపెట్టుకుని అమిత్‌ను అరెస్టు చేసేందుకు ఆఘమేఘాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేశారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సీపీ కార్యాలయం నుంచే టికెట్లను బుక్‌ చేశారు. ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్‌సింగ్‌ జాడ దొరకలేదు. చివరకు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఈలోగా కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

Tags

Next Story