AP : వివేకా హత్య కేసు..సీబీఐ కోర్టుకు నిందితులు

వివేకా హత్య కేసు విచారణలో భాగంగా ఐదుగురు నిందితులు ఈ నెల 10న సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. హైదరాబాద్ సీబీఐ కోర్టుకు కేసు బదిలీ అయ్యాక ఐదుగురు నిందితులనూ ఒకేసారి పిలవడం ఇదే తొలిసారి. వైయస్‌ఆర్ జిల్లా కేంద్రమైన కడప కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు నిందితులకు ప్రొడక్షన్ వారెంట్ జారీ కాగా, బెయిలుపై ఉన్న మరో ఇద్దరికి సీబీఐ నుంచి సమన్లు అందాయి. కడప జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలతో పాటు బెయిల్‌పై ఉన్న ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరి 9న కడప నుంచి బయల్దేరి 10న ఉదయం 10.30 గంటలకు సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్నారు.
జనవరి 27న సీబీఐ కోర్టు కేసు నంబరు ఎస్‌సీ-01-2023 కేటాయిస్తూ వీరికి సమన్లు జారీ చేయగా, అధికారులు దశల వారీగా నిందితులకు అందజేశారు. శనివారం కడపకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి సీబీఐ అధికారులను కలిసి సమన్లు తీసుకున్నారు. దస్తగిరి ఇప్పటికే సమన్లు అందుకున్నారు. ఇక రిమాండు ఖైదీలుగా ఉన్న ముగ్గురికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయడంతో పాటు వారిని సీబీఐ కోర్టులో హాజరుపరచాలని కడప జైలు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు.. వీరిని భద్రత నడుమ హైదరాబాద్‌కు తరలించాలని జైలు అధికారులు ఏఆర్ పోలీసులను కోరారు.
సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ తర్వాత న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను తిరిగి కడప జైలుకు తరలిస్తారా, లేక హైదరాబాద్‌లోనే ఏదైనా జైలుకు పంపుతారా అనేది తేలనుంది. ఇటీవల సీబీఐ అధికారులు కీలక వ్యక్తులను విచారించిన నేపథ్యంలో 10న అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయవచ్చన్న చర్చ సాగుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com