AP: ఏపీలో నిండుకున్న బొగ్గు నిల్వలు

విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేదంటే నీటితో అవుతుంది వర్షాకాలంలో అయితే హైడల్ ప్రొడక్షన్ బాగుంటుంది. వేసవిలో అయితే థర్మల్ మీద ఆధారపడాల్సిందే.ప్రస్తుతం ఏపీలో గ్రిడ్ విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. గతేడాది డిమాండ్ 9వేల994 మెగావాట్లతో పోలిస్తే ప్రస్తుతం అదనంగా 1561 మెగావాట్లు వినియోగం అవుతుంది. గ్రీడ్ గరిష్ఠ డిమాండ్ 11వేల555 మెగావాట్లుగా నమోదైంది.ఇది మార్చి,ఏప్రిల్లో భారీగా పెరిగి 13వేల500 మెగావాట్లకు చేరే అవకాశముందంటున్నారు నిపుణులు.డిమాండ్‌కు సరిపడా విద్యుత్ సరఫరా కోసం అధికారులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. జెన్‌కో థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకోవడంతో ఉత్పత్తి నిలిచే పరిస్థితి నెలకొంది.
థర్మల్ విద్యుత్ ఉత్పాదన కోసం ఏపీకి సొంతంగా గనులు లేకపోవడంతో ఒడిశాలోని తెలిషాహి, నయాపరాతోపాటుగా మధ్యప్రదేశ్‌లోని సులియారి బెల్వార్ గనుల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీ జెన్‌కో, ఏపీఎండీసీలకు కేటాయించిన మేరకు వస్తున్న బొగ్గుని విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తున్నారు. అయితే జెన్‌కో ఆధ్వర్యంలోని 5వేల 850 మెగావాట్ల థర్మల్ కేంద్రాలకు రోజుకు దాదాపు 80 వేల టన్నుల బొగ్గు అవసరం. కృష్ణపట్నంలో ఈ ఏడాది 800 మెగావాట్ల కొత్త ప్లాంటు ఉత్పత్తిలోకి వచ్చింది. స్థానిక బొగ్గు ఆధారంగా పనిచేసే టెక్నాలజీని ఇందులో వినియోగించారు. డియాండ్ ప్రకారం 15రోజుల నిల్వలు అంటే 10 లక్షల టన్నుల బొగ్గు కావాలి.. కానీ ఆ పరిస్థితి లేదు. బొగ్గు నిల్వలు పెంచు కుంటామని అధికారులు చెబుతూనే ఉన్నారు. కానీ ఆ దిశగా చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు.
ఏపీలో పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీపీసీ సింహాద్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నాయి.వాటితో పాటు ఏపీ ప్రభుత్వం పరిధిలో విజయవాడలో ఉన్న నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్,కడపలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. పలు ప్రైవేట్ థర్మల్ పవర్ ప్లాంటులు కూడా ఉన్నాయి.రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రోజు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడింది. 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com