AP: ఇందూ-గృహ నిర్మాణ మండలి ప్రాజెక్టు కుట్రలో వైవి సుబ్బారెడ్డి భాగస్వామే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇందూ-గృహ నిర్మాణ మండలి ప్రాజెక్టుకు సంబంధించిన కుట్రలో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి కూడా భాగస్వామేనని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది సీబీఐ. అర్హత లేని కంపెనీ హౌసింగ్ బోర్డు నుంచి ప్రాజెక్టు పొందిందని, అలాంటి కంపెనీలో సుబ్బారెడ్డి వాటా పొందడం కుట్రలో భాగమేనని పేర్కొంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఇందూ-హౌసింగ్ బోర్డుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
అనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందంటూ దరఖాస్తు చేయడంతో శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటే డిమాండ్ ఉండాలని, ఇక్కడ వైవీ సుబ్బారెడ్డిపై అలాంటి ఆరోపణలు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. ‘ముడుపులు ఇవ్వడం లేదా తీసుకోవడం ఏవీ జరగలేదని.... ప్రాజెక్టులో జాప్యం వల్ల ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి బయటికి వెళుతుంటే ఆ వాటాను సుబ్బారెడ్డి కొన్నారని తెలిపారు. వైవీ.సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా ఒక్క సాక్షి కూడా వాంగ్మూలం ఇవ్వలేదని వాదించారు.
సీబీఐ తరఫు ప్రత్యేక న్యాయవాది ఎం.నాగేంద్రన్ వాదనలు వినిపించారు. ఇందూ ప్రాజెక్ట్‌ను పొందే అర్హత వసంత ప్రాజెక్ట్స్‌కు లేదన్నారు. అలాంటి కంపెనీలో సుబ్బారెడ్డి వాటా పొందడమూ కుట్రలో భాగమేనన్నారు. హౌసింగ్ బోర్డు భాగస్వామ్యంతో నిర్మించిన ప్రాజెక్టులో విల్లాలను తన కుటుంబసభ్యులకు కేటాయించుకోవడం ప్రయోజనం పొందడమేనన్నారు. వసంత ప్రాజెక్ట్స్‌లో వైవీసుబ్బారెడ్డి భాగస్వామి అయ్యాక ఇందూ ప్రాజెక్టుకు గృహ నిర్మాణ మండలి కూకట్‌పల్లిలో అదనంగా మరో 15 ఎకరాలను కేటాయించిందని సీబీఐ అభియోగపత్రంలో వెల్లడించింది. ఇరుపక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com