AP : మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో నీటి కష్టాలు

మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో నీటి కష్టాలు మొదలయ్యయి. వేసవి ఆరంభంలోనే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వచ్చే అరకొర నీటి కోసం గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గమైన యర్రగొండపాలెంలోని పెద్దారవీడు మండలంలోని గ్రామాలు వెలిగొండ ప్రాజెక్టుకు పదుల కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా... ఆ ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. పెద్దారవీడు మండలంలోని నిమ్మద్దలకట, చాట్లమడ, ఎస్సీ కాలనీలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. మూడు గ్రామాలకు కలిపి ఒకే బోరు ఉండటం, అందులోనూ అరకొర నీరు వస్తుండటంతో ప్రజలు పనులు మాని ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేరుకు మాత్రమే మంత్రి సురేష్ నియోజకవర్గమని, ఏనాడూ తమ గ్రామాలను సందర్శించలేదని, కష్టాలను తీర్చే ప్రయత్నం చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్ల యజమానులకు ఏడాది నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో వారు కూడా ట్యాంకర్లను నిలిపేశారన్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి తమ గ్రామాల్లో నీటి సమస్యను తీర్చేలా కృషి చేయాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com