AP: కోడికత్తి కేసులో కోర్టు సీరియస్

కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడేలా చేయడానికి కూడా సీఎం జగన్ కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టు ఎప్పుడు విచారణ జరిగినా బాధితుడు కూడా తప్పకుండా హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నారు. అయితే బాధితుడు అయిన సీఎం జగన్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు. అంతేకాదు కోడికత్తి కేసులో స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టుకు ఎందుకు సమర్పించలేదని ఎన్‌ఐఏ కోర్టు ప్రశ్నించింది. ఇంతవరకు అవి దాఖలు చేయకపోవడమేంటని సీరియస్ అయింది.
మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరుగుతోంది. నాలుగేళ్లయిపోయింది. ఇప్పటికి చార్జిషీటు దాఖలు చేశారు. ప్రతీ వాయిదాకు కేసు విచారణకు నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన CISF అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది.
మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు నుంచి కొన్ని వస్తువులు సీజ్ చేశామని ఎన్‌ఐఏ తెలిపారు. దీంతో ఆ వస్తువులేవని ఎన్‌ఐఏ ప్రత్యేక పీపీను జడ్జి ప్రశ్నించారు. వాటిని అందజేసేందుకు కొంత సమయం కావాలంటూ పీపీ వాయిదా కోరారు. ఇప్పటి వరకు కేసుకు సంబంధించినవి కోర్టులో దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ ప్రారంభమయ్యే నాటికి కేసుకు సంబంధించిన వస్తువులు చూసుకోవాల్సిన బాధ్యత ఎన్‌ఐఏపై ఉందంటూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోఉన్న నిందితుడు శ్రీనివాసరావును సకాలంలో నిందితుడిని హాజరుపర్చక పోవడంపై కూడా జడ్జి సీరియస్ అయినట్లు సమాచారం.
ఇక గతంలో ఎన్‌ఐఏ 56 మంది సాక్షులతో న్యాయస్థానంలో ఛార్జిషీట్ వేయగా..ప్రస్తుతం 10 మంది సాక్షుల జాబితాతో ఎన్‌ఐఏ షెడ్యూల్ కోసం మెమో దాఖలు చేసింది. ఇందులో మొదటి సాక్షి, బాధితుడు సీఎం జగన్. సాక్షుల హాజరు షెడ్యూల్ కోసం ఈ నెల 14కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జగన్ కోర్టుకు ఎప్పుడు హాజరవుతారనేది ఆరోజు తేలనుంది. అలాగే కేసులో స్వాధీనం చేసుకున్న ఏయే వస్తువులను కోర్టుకు సమర్పిస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com