AP : సత్యకుమార్ పై దాడిని ఖండించిన చంద్రబాబు

AP : సత్యకుమార్ పై  దాడిని ఖండించిన చంద్రబాబు

మందడంలో బీజేపీ నేత సత్యకుమార్‌పై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైసీపీ గూండాలే సత్యకుమార్‌పై దాడి చేశారని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేశారన్న చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులపై పోలీసులు స్పందించడం లేదన్నారు. సత్యకుమార్‌పై దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి దాడులకు టీడీపీ ఎప్పుడు వ్యతిరేకమేనన్న చంద్రబాబు.. వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు.

అమరావతిలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడికి తెగబడ్డాయి. దీంతో మందడంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అమరావతి ఉద్యమం 12 వందల రోజులకు చేరుకున్న నేపథ్యంలో రైతులకు సత్యకుమార్‌ మద్దతు తెలిపారు. తిరిగి వస్తున్న సమయంలో మూడు రాజధానుల శిబిరం వద్ద ఆయన వాహనాన్ని వైసీపీ మూకలు అడ్డుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్‌ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.. ఈ క్రమంలో సత్యకుమార్‌ వాహనంపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు సత్యకుమార్‌. దాడి ఘటనపై డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీలోని వైసీపీ అరాచకానికి అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. బాబాయిని చంపినట్లు ఆదినారాయణరెడ్డిని చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కారుపై రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని సత్యకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ కార్యకర్తలను వెంటబడి కొట్టారని.. పోలీసులు కార్లను ఆపేసిన వెంటనే దాడి మొదలైందని సత్యకుమార్‌ తెలిపారు. కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదన్నారు. దాడి చేస్తున్న వారిని నియంత్రించలేదని, దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూశారని ఆయన ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకగళం లేకుండా చేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఇటువంటి దాడులకు భయపడేది లేదన్నారు సత్యకుమార్‌.

Read MoreRead Less
Next Story