AP : జగన్ సర్కార్ నిర్ణయాలతో ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలు

AP : జగన్ సర్కార్ నిర్ణయాలతో ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలు
ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకే కాకుండా ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి పడుతుంది

ఏపీ సర్కార్‌ నిర్ణయాలతో మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్నే అతలాకుతలం చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకే కాకుండా ప్రభుత్వ ఖజానాకి భారీగా గండి పడుతుంది.ఆస్థి విలువ, రిజిష్ట్రేషన్ ఛార్జీలు రెండు సార్లు పెంచడంతో రియల్‌ ఎస్టేట్‌ నేల చూపులు చూస్తోంది. విశాఖపట్నం దాని పరిసర జిల్లాల పరిధిలో ఆస్తుల క్రయ,విక్రయాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని ప్రభుత్వం పదేపదే చెపుతున్నా..భవిష్యత్‌ లో సచివాలమం ఇక్కడే వస్తుందని చెపుతున్నభీమిలి-విజయనగరం ప్రాంతంలోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరగడం లేదు. విశాఖతో పోల్చుకుంటే అమరావతి పరిసర ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు,కృష్ణా జిల్లాల పరిధిలో స్థిరాస్తి క్రయ,విక్రయాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో తగ్గిపోయిన రియల్‌ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకున్నట్లు కనిపిస్తోంది.


మరోవైపు 2021-22తోపోలిస్తే 2022-23లో ఏపీ మొత్తం మీద రిజిస్ట్రేషన్ల పైన వచ్చిన ఆదాయంలో 9.85 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వానికి 2021-22లో రిజిస్ట్రేషన్లతో 7వేల347 కోట్లు ఆదాయం వస్తే.. 2022-23లో 8వేల 071 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచింది. ఈ నేపధ్యంలో విశాఖకు దగ్గరగా ఉండే అనకాపల్లి జిల్లా ఆదాయపరంగా నాలుగున్నర శాతం వెనకబడింది. ఒక్క విశాఖలో మాత్రమే 2.84 శాతం వృద్ధి నమోదైంది. విజయనగరం జిల్లాలో 2021-22లో కంటే 2022-23లో దాదాపు ఆరున్నర శాతం తగ్గింది.


మరోవైపు అమరావతి ప్రాంతంలో గుంటూరులో 17.48శాతం,పల్నాడులో 24.95, బాపట్లలో 18.44, ఎన్టీఆర్‌ జిల్లాలో 25.86 శాతం ఆదాయం పెరిగింది. కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేస్తే మొత్తం విస్తీర్ణంలో 5 శాతం స్థలాన్ని పేదల గృహవసతి కోసం ప్రభుత్వానికి అప్పగించాలన్న నిబంధనను జనవరిలో జగన్‌ సర్కార్‌ ఉపసంహరించుకున్నా...ఆదాయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. అలాగే 2021-22 మార్చి నెలలో దాదాపు వేయి కోట్ల ఆదాయం వస్తే.. 2022-23 మార్చిలో 950 కోట్లు మాత్రమే వచ్చింది.ఆదాయం పెరిగేలా చూడాలని రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి జిల్లా అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఫలితం కనిపించ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల 5వేల177 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఓటీఎస్‌ కింద జరిగిన రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి.ఎన్టీఆర్‌ జిల్లా తర్వాత పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే అత్యధికంగా ఆదాయం వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది.

ఇక విశాఖ పరిసర ప్రాంతాల్లో కొంత వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. అందువల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. భీమిలి సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో 2022 ఫిబ్రవరిలో 57 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయానికి యాభై కోట్లు మాత్రమే వచ్చింది. భీమిలి తరవాత పెందుర్తికి రియల్‌ ఎస్టేట్‌ లో ప్రాధాన్యం ఉంటుంది. గత ఏడాదిలో పెందుర్తిలో రిజిస్ట్రేషన్ల ద్వారా 73 కోట్లు వస్తే.. ఈ ఏడాది 64 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఇండ్రస్ట్రీయల్‌ ఏరియాలోని పెదగంట్యాడ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 61 కోట్లు వస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 58 కోట్లు మాత్రమే వచ్చింది. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో క్రయవిక్రయాలు మందగించడానికి కొత్త లేఅవుట్లు రాకపోవడం ఒక కారణంగా కనిపిస్తోంది. గతంలో ఏడాదికి వంద లేఅవుట్లు వరకు కొత్తవి వచ్చేవి. ఇప్పుడు ఎనిమిది లేఅవుట్ల మాత్రమే వేయడంతో పెద్దగా విక్రయాలు జరగలేదు.

Tags

Read MoreRead Less
Next Story