AP: వచ్చే ఎన్నికల్లో వారసుల ఎంట్రీ.. టికెట్ దిశగా పావులు

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో వారసులను రాజకీయాల్లోకి తెచ్చేందుకు తండ్రులు తెగ ఆరాటపడుతున్నారట. తమ కుమారులకు టికెట్లు ఇప్పించుకుని తమ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పొలిటికల్ ఎంట్రీ పక్కాగా జరిగేటట్లు కీలక నేతల వారసులు పావులు కదుపుతున్నారట. ముఖ్యంగా ఈ సారి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎక్కువ మంది వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి రంగంలోకి దిగేందుకు వారసులు సిద్ధమవుతున్నారట. దీంతో నిత్యం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ప్రజలతో మమేకమువుతున్నారట. పార్టీ పిలుపునివ్వడమే తరువాయి తమ అనుచరగణంతో యువ నేతలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండే నేతలకు ఇపుడు వారసుల రూపేణా కొంత ఉపశమనం లభిస్తున్నట్లు సమాచారం.
ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ...పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా తరచూ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు ఇపుడు నియోజకవర్గంలో తండ్రి తరపున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ..పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారట. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రామ్ మల్లిక్ నాయుడు నియోజకవర్గంలో తండ్రి తరపున అన్నీ తానై కార్యకర్తలకు తలలో నాలుకగా మారారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో తనకున్న అనుభవంతో నిత్యం యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. తండ్రి కళా వెంకట్రావు హాజరుకాలేని పలు కార్యక్రమాలకు రామ్ మల్లిక్ నాయుడు హాజరవుతూ కార్యకర్తలకు చేరువవుతున్నారట.
మరోవైపు పాతపట్నం నియోజకవర్గం టీడీపీలోనూ యువత జోష్ ఎక్కువగానే కనిపిస్తోందట. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తనయుడు సాగర్ ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పాతపట్నం టీడీపీలో అంతా సాగర్ హవానే నడుస్తోందట. తండ్రి వెంకటరమణ సూచనలతో పార్టీ కార్యక్రమాల్లో సాగర్ చురుగ్గా పాల్గొంటూ టున్నారట. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారట. జిల్లాలో టీడీపీ హిరమండలానికి చెందిన ఒకే ఒక జెడ్పీటీసీలో మాత్రమే విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో స్ధానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు స్వయంగా బరిలో నిలిచారు. అయితే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ఓటమి వెనుక కలమట సాగర్ వ్యూహం ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సాగర్ నియోజకవర్గంలో యాక్టివ్ కావటంతో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు కొంత ఒత్తిడి తగ్గిందని నియోజకవర్గ టీడీపీలో చర్చ జరుగుతోంది.
ఈ సారి ఎన్నికల్లో యువతకు భారీగా టికెట్లు కేటాయిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో పలువురు నేతలు తమ వారసులను ఎన్నికల్లో బరిలోకి దింపి సెటెల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశంలో వారసుల ఎంట్రీతో ఎచ్చెర్ల, పాతపట్నం నియోజకవర్గాల క్యాడర్ లో కొత్త జోష్ కనిపిస్తోందట.ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో వారసుల ఎంట్రీపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com