AP: పదింతలు పెరిగిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలు

ఏపీ ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ యూజర్ ఛార్జీలను ఏకంగా పదింతలు పెంచేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 24 గంటల్లో ఉత్తర్వులను అమలుచేయాలని జిల్లా అధికారులను రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ ఆదేశించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన యూజర్ ఛార్జీలవల్ల ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌పై అదనంగా సుమారు 750 రూపాయల వరకు భారం పడనుంది. ఆయా ప్రాంతాల్లోని ఆస్తుల మార్కెట్ విలువను తెలియచేస్తూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ధ్రువీకరణపత్రాన్ని అందచేస్తుంది. దీనికి ఇప్పటివరకు 10రూపాయలు తీసుకుంటుండగా సవరించిన ధరల ప్రకారం 50రూపాయాలు చెల్లించాలి.
ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జి కింద ప్రస్తుతం 100 నుంచి 200 వరకు వసూలు చేస్తున్నారు. ఇక దీనిని 500 చేశారు. రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తి తాలూకా దస్తావేజు నకలుకు ఇప్పటివరకు 20 రూపాయలు చెల్లిస్తున్నారు. దీని ఖరీదు 100 రూపాయలు అయింది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ కింద అందించే సేవల్లో భాగంగా హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్, పవర్ బ్యాకప్, విద్యుత్తు వినియోగ బిల్లు, ఇతర అవసరాలకు ఖర్చులు పెరిగాయని పేర్కొంటూ ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com