AP : ప్రపంచంలో అందమైన 6 భవిష్యత్తు నగరాలలో అమరావతి

ప్రపంచంలోనే అందమైన 6 భవిష్య నగరాల జాబితాలో ఏపీ రాజధాని అమరావతికి చోటు దక్కింది. రాబోయే 50 ఏళ్లలో ప్రపంచం ఎలా ఉండబోతోందనే దానికి.. అమరావతి, సహా దేశాల్లోని మరో 5 నగరాలు అద్దం పట్టనున్నాయని ప్రపంచ ప్రతిష్ఠాత్మక మ్యాగజైన్ 'ఆర్కిటెక్చరల్ డైజెస్ట్' వెల్లడించింది. 6 మోస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ బీయింగ్ బిల్ట్ అరౌండ్ ది వరల్డ్' శీర్షికతో ఆ మ్యాగజైన్ నగరాల నమూనాలతో సహా కథనాన్ని ప్రచురించింది. ఆ జాబితాలో అమరావతిని చేర్చింది.
ప్రపంచంలో భవిష్య నగరాలు ఎలా ఉంటాయో చూపేందుకు ఒక మచ్చుతునకగా అమరావతిని నిర్మించేలా ఫోస్టర్ అండ్ పార్టనర్స్ బృహత్ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆఫీసుల సముదాయం నగరానికే తలమానికంగా నిలిచేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే నగరానికి వెన్నెముకలా సెంట్రల్ గ్రీన్‌స్పేస్‌ను తీర్చిద్దాలనేది ప్రతిపాదన. మొత్తం విస్తీర్ణంలో 60శాతం మేర పచ్చదనం, నీళ్లు ఉండేలా... హరిత, నీలినగరంగా నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించేందుకు టీడీపీ హయాంలో 2014-19 మధ్య విశేష కృషి జరిగింది. ఎక్కడా లేనివిధంగా రైతులే ముందుకొచ్చి నగర నిర్మాణానికి 33వేల ఎకరాల వ్యవసాయ భూమిని త్యాగం చేశారు. రహదారులు, కాలవలు, వంతెనలు తదితర మౌలికవసతుల నిర్మాణం కొంతమేర పూర్తయ్యింది. దిగ్గజ భవనాల నిర్మాణమూ చేపట్టారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.10వేల కోట్లు వెచ్చించి నగర నిర్మాణాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక నిరాధార, అసత్య ఆరోపణలతో నగర నిర్మాణాన్ని పూర్తిగా నిలిపేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com