AP : ఖర్చులకు డబ్బులు లేవు... అమ్మకానికి ప్రభుత్వ భూములు

రోజూవారి ఖర్చులకు కూడా ఆర్ధిక సంస్థల దగ్గర చేయి చాపుతున్న జగన్ సర్కార్..భూముల అమ్మకంపై దృష్టి పెట్టింది. సీఆర్‌డీఏ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.మొదటి విడతగా 14 ఎకరాలు అమ్మేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-ఆక్షన్ పోర్టల్ ద్వారా వేలం వేసేందుకు ఆఫ్‌సెట్ ప్రైస్ నిర్ణయించాలని గుంటూరు జిల్లా అధికారులను ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల కమిటీ సమావేశం నిర్వహించి భూముల అమ్మకంపై చర్చించింది.చినకాకాని-గుండుగొలను.. విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద పదెకరాల భూమి ఎకరం 5 కోట్ల 94లక్షల50 వేల రూపాయల చొప్పున అమ్మాలని నిర్ణయించారు.అలాగే రాజధాని అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామానికి ఆనుకొని సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర ఉన్న నాలుగు ఎకరాల భూమిని ను ఒక్కో ఎకరం 5 కోట్ల41 లక్షల 4 వేల 4 వందల చొప్పున అమ్మేందుకు నిర్ణయం తీసుకుంది.
అయితే పిచ్చుకలపాలెం వద్ద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు బీఆర్ శెట్టి సంస్థ గతంలో ఈ భూమిని తీసుకొంది.సుమారు పన్నెండు వందల కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని హామీ ఇచ్చింది. కానీ అమరావతి రాజధాని నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిలిపేయడంతో గతంలో ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకొన్న సంస్థలన్నీ వెనకడుగు వేశాయి. ఇదే అదనుగా భావించిన సర్కార్ గత సంవత్సరం ఈ భూమిని అమ్మేందుకు సీఆర్‌డీఏ ద్వారా అమ్మేందుకు ప్రయత్నించింది. ప్రజా సంఘాలు, న్యాయ వ్యవస్థలు తీవ్రంగా తప్పు పట్టడంతో పాటు వివిధ కారణాలతో భూముల వేలం పాట నిలిచిపోయింది.
మరోవైపు రాజధానిలో ఒక్క ఇటుక కూడ పేర్చకుండా భూములను అమ్మే హక్కు ఈ ప్రభుత్వానికి లేదంటూ రైతులు,ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే వీరి ఆందోళనలను లెక్క చేయని సర్కార్ ఇప్పుడు పిచ్చుకలపాలెంతో పాటు నవులూరు వద్ద మరో 10ఎకరాలు కూడా ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. కొవిడ్ టైంలోనూ గుంటూరు నగరంలో పీవీకే నాయుడు మార్కెట్, నల్లపాడు, కాకుమానువారి తోటలో భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పట్లో సోషల్ యాక్టవిస్ట్ లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఈ కేసు విచారణలో ప్రభుత్వం దివాలా తీసిందా హైకోర్టు ప్రశ్నించింది కూడా. దీంతో ఆ భూముల విక్రయం నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మళ్లీ ఇప్పుడు సీఆర్‌డీఏ భూములను అమ్మకానికి పెట్టడంతో ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com