ముగిసిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం
ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. అధికార, విపక్షాల నుంచి వచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసులపై చర్చించిన ప్రివిలేజ్ కమిటీ.. టీడీపీ సభ్యులు అచ్చెన్న, నిమ్మలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు పదిరోజులు గడువు ఇచ్చింది. జనవరి పదో తేదీలోగా సమాధానం ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసుల్లో పేర్కొంది.
అటు తామిచ్చిన నోటీసుల విషయమేంటంటూ టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ప్రివిలేజ్ కమిటీ భేటీలో ప్రస్తావించారు.. సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించారని టీడీపీ నోటీసులు ఇవ్వగా, అవి సరైన ఫార్మాట్‌లో లేని కారణంగా తిరస్కరిస్తున్నట్లు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ సమాధానం చెప్పారు. అంతేకాదు, అచ్చెన్నాయుడికి నోటీసులపై స్పీకరే స్వయంగా రిఫర్ చేశారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ సమాధానమిచ్చారు. అలాగే నిమ్మల రామానాయుడిపై ప్రివిలేజ్ నోటీసు విషయంలో సభలో తీర్మానం చేసినట్లుగా కాకాణి వివరించారు. అయితే, తామిచ్చిన నోటీసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ మరోసారి అసెంబ్లీ సెక్రటరీని కోరారు టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్. సభలో సభ్యులందరి హక్కులను కాపాడే విధంగా ప్రివిలేజ్ కమిటీ వ్యవహరించాలన్నారు.
175 మంది శాసనసభ్యుల హక్కులు కాపాడాలని తొలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. స్పీకర్, సభ రిఫర్ చేసిన సభ్యుల నుంచి వివరణ కోరామన్నారు. పదిరోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలన్నారు. తొలి సమావేశంలో నాలుగు పిటిషన్లు కమిటీ ముందుకొచ్చాయని, రెండు ఫిర్యాదులు అచ్చెన్నపై జోగి రమేష్, గడికోట శ్రీకాంత్ రెడ్డి వచ్చినవి కమిటీ ముందుకొచ్చినట్లు చెప్పారు. రామానాయుడిపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని సభలోనే సీఎం చెప్పారన్నారు.
సభ నిర్ణయం మేరకు ప్రివిలేజ్ మోషన్ స్వీకరించామని కాకాణి చెప్పారు. శాసనసభ్యులు చాలా మంది ఫిర్యాదులు ఇస్తారని, టీడీపీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ లేదా సభ రిఫర్ చేస్తే తప్పకుండా చర్చిస్తామని అన్నారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను కమిటీలో సుమోటోగా చర్చించే అవకాశం లేదన్నారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన అనగాని సత్యప్రసాద్ టీడీపీ పిటిషన్ల విషయం ప్రస్తావించారని, అయితే, అవి విచారణార్హం కాదని చెప్పినట్లుగా కాకాణి వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com