Assembly: రెండోరోజు శాసనసభలో కొనసాగిన సస్పెన్షన్లు

Assembly: రెండోరోజు  శాసనసభలో కొనసాగిన సస్పెన్షన్లు
చంద్రబాబు అరెస్టుపై దద్దరిల్లిన శాసనసభ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై శాసనసభ దద్దరిల్లింది. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. వైకాపా రెబల్‌ MLAలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా తెదేపా సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

గురువారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే తెదేపా సభ్యులు చంద్రబాబు అరెస్టుపై తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. చంద్రబాబుపై కక్షసాధింపుతో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వైకాపా, తెదేపా సభ్యుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై చర్చకు డోలా బాలవీరాంజనేయస్వామి సహా తెదేపా సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయం మొదలైన వెంటనే తెదేపా సభ్యులు నిరసన చేపట్టారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్‌లో నిలబడగా, మిగతా సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.పోడియం పై నుంచి తెదేపా సభ్యుల నినాదాలు, కింద నుంచి వైకాపా సభ్యుల హేళనలు, వెక్కిరింతలతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. తెదేపా సభ్యులు సరియైన ఫార్మాట్‌లో వస్తే వారు డిమాండ్‌ చేస్తున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. తెదేపా సభ్యుల తీరు ఇలాగే కొనసాగితే వైకాపా సభ్యులూ రెచ్చిపోయే ప్రమాదం ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ సందర్భంగా పోడియంపై ఉన్న తెదేపా సభ్యుడు నందమూరి బాలకృష్ణ, మంత్రి అంబటి మీసం తిప్పుతూ సవాళ్లు చేసుకున్నారు. సభలో గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.


సభ ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు మరింత ఉద్ధృతంగా నినాదాలు చేయసాగారు. అప్పటికి సీఎం జగన్‌ సభలోనే ఉన్నారు. ఈసారి తెదేపా సభ్యులు పోడియంపైకి వెళ్లకుండా పదుల సంఖ్యలో మార్షల్స్‌ని మోహరించారు. ఒక్క తెదేపా సభ్యురాలు ఆదిరెడ్డి భవానీకే ఆరేడుగురు మహిళా మార్షల్స్‌ని కాపలా పెట్టారు. తెదేపా సభ్యులు సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాయితాలు విసిరేశారని స్పీకర్‌ అన్నారు. సభ ఔన్నత్యాన్ని తొలగించేలా తొడలు చరచడం, మీసాలు మెలివేయడం వంటి వికృత చేష్టలు సభలో చేయడమే తప్పుని సభాస్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేసిన నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారన్నారు. మొదటి తప్పిదంగా భావించి ఆయనకు సభ తొలి హెచ్చరిక చేస్తోందన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా సభ ఆయనను హెచ్చరిస్తోందని పేర్కొన్నారు. శ్రీధర్‌రెడ్డి, సత్యప్రసాద్‌లను ప్రస్తుత సమావేశాల జరిగినంత కాలం, మిగతా తెదేపా సభ్యుల్ని, ఉండవల్లి శ్రీదేవిని గురువారం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ మొదట ప్రకటించారు. తెదేపా సభ్యులపైకి దూసుకొస్తున్న మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేల్ని.... తెదేపా సభ్యుడు పయ్యావుల కేశవ్‌ వీడియో తీయడంపై వైకాపా సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఆయనపైనా చర్య తీసుకోవాలని బుగ్గన సూచించడంతో... కేశవ్‌ను కూడా ప్రస్తుత సమావేశాలు జరిగినంత కాలం సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు.


Tags

Read MoreRead Less
Next Story