తొలిరోజే వేడెక్కిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు.. మొదటి రోజే అధికార, ప్రతిపక్షాలకు మధ్య వాగ్వాదం దద్దరిల్లాయి. వైసీపీ సర్కారు సభా సంప్రదాయాలు పాటించడం లేదంటూ టీడీపీ నిరసనలు చేపట్టింది. సభ ప్రారంభం నుంచే వాడీ వేడీగా సాగుతున్నాయి. ప్రతిపక్షానికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు. చర్చలకు ఆస్కారం లేకుండా బిల్లులు ఆమోదించడం దారుణమని ధ్వజమెత్తారు. తుపానుకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. సభలో చర్చకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ.... స్పీకర్ పోడియం ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు.
అంతకుముందు... పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో గొడవ జరిగింది. బిల్లులోని పలు సవరణలపై టీడీపీ అభ్యంతరాలు తెలిపింది. స్థానిక ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకే పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చినట్టు సీఎం జగన్ తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ప్రమేయం తగ్గించడమే బిల్లు ఉద్దేశమని చెప్పారు. టీడీపీ అభ్యంతరాల మధ్యనే.. ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా టీడీపీ వాకౌట్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com