AP: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరుతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానున్నందున మరో మూడు నెలలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టనునట్లు సమాచారం.
వైసీపీ విధ్వంస పాలనపై ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ముందు ఉంచారు. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖల శ్వేతపత్రాలపై సభలోనే చర్చ పెట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఉదయం 8.30 గంటలకు వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తారు. పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని టీడీఎల్పీ సూచించింది.
గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో గురుపౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com