ఏపీలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకూడా లేదు : బీజేపీ

అంతర్వేది రథం దగ్దం ఘటనను నిరసిస్తూ బీజేపీ తలపెట్టిన ఛలో అమలాపురం ఉద్రిత్తతకు దారితీసింది. పోలీసులు పలు జిల్లాలో బీజేపీ నాయకులను ముందస్తుగా హౌజ్ అరెస్టు చేశారు. అంతర్వేదికి బయలుదేరిన బీజేపీ శ్రేణులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకూడా లేదా అంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జనసేన చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అమలాపురం డివిజన్‌లోని మూడు రోజులపాటు 144 సెక్షన్ విధించారు. చలో అమలాపురం నేపథ్యంలో దుకాణాలు మూసివేశారు. అమలాపురం వస్తున్న పలువురు నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించారు. వివిధ మార్గాల్లో వస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో పోలీసులు ముందస్తుగా బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కారంచేడులో దగ్గుబాటి పురందేశ్వరిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంతర్వేది రథం దగ్దం, దుర్గాదేవి ఆలయంలో వెండిసింహాల అపహరణలపై అధికారులు, నాయకులు అసంబద్ద వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని పురందేశ్వరి విమర్శించారు.
అనంతపురం జిల్లాలోనూ బీజేపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుచేశారు. అరెస్టులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని వారు ఆరోపించారు. రాష్ట్రప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ని అక్రమ అరెస్టు చేయడాన్ని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
చలో అమలాపురం కార్యక్రమాన్ని అడ్డుకోవడంపై విశాఖలో బీజేపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. గృహ నిర్బంధంలో వున్న బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ తీరును ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
మరోవైపు చలో అమలాపురం నేపథ్యంలో ముందురోజు రాత్రే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 20 గంటల తర్వాత విడిచిపెట్టారు. రాత్రంతా 300 కిలోమీటర్లు తిప్పిన పోలీసులు 20 గంటల తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ నుంచి వదలిపెట్టారు. విష్ణువర్థన్‌రెడ్డికి ఉన్న గన్‌మెన్‌లను, వ్యక్తిగత సిబ్బందిని కూడా కలవకుండా ఒక్కరినే తీసుకువెళ్లి నిర్బంధించడం పట్ల BJP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో బీజేపీ నేతల అక్రమ అరెస్టులపై ఆ పార్టీ ఎంపీలు జీవీఎల్, సీఎం రమేశ్ మండిపడ్డారు. నిబంధనలు అనుసరించి ఆందోళన చేస్తున్నవారిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాల దాడులపై.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశామన్నారు. మొత్తంగా ఏపీ ప్రభుత్వంతోపాటు, పోలీసుల తీరుపై బీజేపీ నేతలు సీరియస్ అవుతున్నారు. మత ప్రాతిపదికన పోలీసులు పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com