AP: ప్రధాన హామీల అమలు దిశగా కీలక నిర్ణయాలు
ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత చేసిన తొలి ఐదు సంతకాలకు సంబంధించిన అంశాలకు ఆమోద ముద్ర వేసింది. లక్షల మంది నిరుద్యోగుల ఎదురు చూపులు ఫలించేలా మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ్మతి తెలిపింది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేయాలని నిర్ణయించింది. 65.30 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రత పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచాలని తీర్మానించింది. విద్యార్థులు, యువతలో నైపుణ్య గణన చేపట్టాలని, తొలి దశలో 183 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని తీర్మానించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో వివిధ రంగాలు భ్రష్టుపట్టిన తీరుపై మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయాలని తీర్మానించింది.
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపొందిం చేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ జరిగింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గం నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు.
విజయవాడలోని వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో ఎన్టీఆర్ పేరుతోనే ఉన్న యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం పేరు మార్చిందన్న మంత్రి పార్థసారథి, ఫలితంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల మేరకు పాత పేరునే పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని సర్వే చేసి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి కోసం నైపుణ్య గణన చేస్తామన్న మంత్రి పార్థసారథి, వ్యవసాయ రంగంలోనూ నైపుణ్య గణన చేపడతామన్నారు.
ఏపీలో గంజాయి నివారణకు హోంమంత్రి అనిత నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. గంజాయి నిర్మూలనపై ఉక్కుపాదం మోపాలని సీఎం స్పష్టం చేశారన్న మంత్రి పార్థసారథి, గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు ఈ కమిటీ సూచనలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న వివిధ అక్రమాలపై 7 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు పార్థసారథి వెల్లడించారు. ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సీజనల్ వ్యాధులు ప్రబలడంపై మంత్రివర్గంలో చర్చించామన్న పార్థసారథి, వాటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com