సీఎం జగన్‌కు అమరావతి రైతుల నిరసన సెగ

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు మరోసారి అమరావతి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది.. జగన్ సచివాలయానికి వెళ్తున్న సమయంలో జై అమరావతి అంటూ నినాదాలతో హోరెత్తించారు రైతులు.. ఈ ఘటన మందడంలో జరిగింది.. మందడం మీదుగా జగన్ కాన్వాయ్‌లో సచివాలయానికి వెళ్తున్న సమయంలో రైతులు రోడ్డు మీదకు వచ్చారు.. రైతులతోపాటు మహిళలు అమరావతి ప్లకార్డులు పట్టుకుని జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.. అయితే, కాన్వాయ్‌ని అడ్డుకుంటారన్న అనుమానంతో పోలీసులు రైతులకు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు.
415 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు.. 29 గ్రామాల రైతులు దీక్షలు కొనసాగిస్తున్నారు.. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళనలు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. 33వేల ఎకరాల భూమిని త్యాగం చేసి.. ఐదు కోట్ల ఆంధ్రులకు రాజధాని ఇచ్చామన్నారు రైతులు. అమరావతే ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించేవరకు.. వెనకడుగు వెయ్యబోమంటున్నారు. రాజధాని కోసం తాము చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం సరైనది కాదు కాబట్టే తమకు ముఖం చూపించలేకపోతున్నారని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com