AP: ఉచిత బస్సుపై హర్షాతిరేకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నెలవారీ ఖర్చులు ఆదా అవుతాయని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అతివకు కానుకగా ఏపీ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుర్తింపు కార్డు చూపిస్తే.. కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇస్తున్నారు. పూర్తి స్థాయిలో శనివారం నుంచి మహిళలు తమ గుర్తింపు కార్డు చూపించి ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం ఈ పథకంపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. పలువురు ప్రయాణికులు , టీడీపీ కార్యకర్తలు బస్సుల్లో మహిళలు పథకాన్ని ఎలా వినియోగించుకుంటున్నారో వీడియోలు తీసి అప్ లోడ్ చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం అత్యధిక బస్సుల్లో మహిళలకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. చాలా స్వల్ప సంఖ్యలోనే బస్సులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కొన్ని వీడియోలను వారు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తిరుమలకు టిక్కెట్ తీసుకుంటున్నారని.. తిరుమల పక్క రాష్ట్రంలో ఉందా అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణలకు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తం ఉన్న బస్సెస్ లో 85% లో ఫ్రీ అది కూడా స్టేట్ మొత్తం వర్తింప చేశారని.. కర్ణాటక, తెలంగాణ కంటే బెటర్ గా ఇస్తున్నారన్నారు. సప్తగిరి బస్సుల్లో మాత్రం ఉచితం కాదని అవి ఆర్టీసీ కిందకు కాకుండా.. టీటీడీ కిందకు వస్తాయి కాబట్టి టెక్నికల్ సమస్యలు ఉన్నాయంటున్నారు.
టికెట్‌తో సెల్ఫీ దిగి పెట్టండి
ఏపీలో మహిళా సాధికారత ఎలా ఉందో ప్రపంచానికి చాటుదామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఉచిత బస్సు టికెట్‌తో సెల్ఫీ దిగి #FREEbusTicketSelfie అని ట్యాగ్ చేయాలని మహిళలను కోరారు. సురక్షితంగా.. గౌరవంతో కూడిన ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మహిళకు కల్పిస్తోందని వెల్లడించారు. మహిళలకు కల్పిస్తున్న ప్రతి ఉచిత బస్సు టికెట్ ఆశ, స్వేచ్ఛ, గౌరవంతో కూడినదని వ్యాఖ్యానించారు. ఇది స్వాతంత్ర్యం, సమానత్వంతో కల్పించిన అవకాశం అని తెలిపారు. ప్రభుత్వం స్త్రీ శక్తి, ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు సాధికారత కల్పించడం గర్వంగా ఉందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com