CBN: లెక్కలు తేల్చేందుకు కొత్త కాగ్‌ కావాలేమో

CBN: లెక్కలు తేల్చేందుకు కొత్త కాగ్‌ కావాలేమో
జగన్‌ పాలనలో ఆర్ధిక విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం.. విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల

జగన్‌ ప్రభుత్వ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై లెక్కలు తేల్చాలంటే కొత్త కాగ్‌ అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. విద్యుత్‌రంగంపై చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. జగన్‌ పాలనలో అన్ని రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్‌ రంగాన్ని జగన్‌ సర్వనాశనం చేశారని... కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్‌ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి, మిగతాది దారి మళ్లించారని ఆరోపించారు. విద్యుత్‌ రంగంలో తాను తెచ్చిన సంస్కరణల వల్ల తాను అధికారం కోల్పోయానని.. కానీ ఆ సంస్కరణల వల్లే దేశం దేశం బాగుపడిందని చంద్రబాబు అన్నారు. తాను ప్రవేశపెట్టిన విద్యుత్‌ సంస్కరణలపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల 2004 ఎన్నికల్లో అధికారం కోల్పోయామని తెలిపారు. జగన్‌ దుర్మార్గపు పాలనలో అస్తవ్యస్తమైన విద్యుత్‌ రంగాన్ని మళ్లీ గాడిన పెట్టడం చాలా పెద్దపనే అయినా, సవాల్‌గా తీసుకుంటామని తెలిపారు.

ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తే.. వైసీపీ నాయకులకు కడుపునొప్పి మొదలైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుకను ఇంటికి తీసుకెళ్లి ఉచితంగా అందజేస్తామని తాము చెప్పినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నదులు, కాల్వల్లో ఇసుక ఉంటే.. ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఉచితంగా తీసుకెళ్లవచ్చని చెప్పామన్నారు. వైసీపీ నాయకులూ వాళ్ల ఊళ్లలో ఎడ్లబళ్లు కట్టుకుని ఇసుక తీసుకెళ్లొచ్చన్నారు. ప్రస్తుతం 48 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉందని, బోట్స్‌మెన్‌ సొసైటీల ద్వారా మరో 60-70 లక్షల టన్నులు అందుబాటులోకి తేవచ్చని అన్నారు.

పేదలపై ఇప్పటికే భారం పడిపోయిందని.... కొత్త విద్యుత్‌ టారిఫ్‌లు వచ్చే మార్చికి అమల్లోకి వస్తాయని చంద్రబాబు చెప్పారు. అప్పటికి ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. ప్రభుత్వం ముందు చాలా సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులూ ఉన్నాయన్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిశానని... మన కష్టంతో ముందుకెళుతూనే, వారి సాయం కూడా తీసుకోవాలన్నారు. ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మొత్తం భారం వాళ్లనే తీసుకోమనలేమన్నారు. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయి. వాళ్లు 29 రాష్ట్రాల్ని సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం విద్యుదుత్పత్తి సంస్థలకు ఎడాపెడా చేసిన భూకేటాయింపులు, సెకీ వంటి సంస్థలతో చేసుకున్న కొనుగోలు ఒప్పందాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవడానికి చట్టాలు, కోర్టులు ఉన్నాయన్నారు.

Tags

Next Story