AP Discom : ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు.. ప్రజల పై అదనంగా ఎంత భారం పడుతుందంటే..?

AP Discom : ఆర్థిక సంక్షోభంలో ఏపీ డిస్కంలు.. ప్రజల పై అదనంగా ఎంత భారం పడుతుందంటే..?
AP Discom : ఏపీ వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులను ముక్కుపిండి వసూలు చేస్తున్న డిస్కమ్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి.

AP Discom : ఏపీ వినియోగదారుల నుంచి నెలవారీ బిల్లులను ముక్కుపిండి వసూలు చేస్తున్న డిస్కమ్‌లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. వాల్వాహన్‌ రెన్యూవెబుల్‌ ఎనర్జీ సంస్థ దాఖలు చేసిన అఫిడవిట్‌లో డిస్కమ్‌లు ఈ విషయాన్ని ధృవీకరించాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌, రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్‌తో సహా వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి 38 వేల 836 కోట్ల రుణాలు ఉన్నాయని...ప్రభుత్వ శాఖల నుంచి దాదాపు 9 వేల 115 కోట్ల రావాల్సి ఉందని వెల్లడించాయి. ప్రభుత్వం 3 వేల 87 సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి ఉందని తెలిపాయి.

విద్యుత్‌ ఉత్పిత్తి సంస్థలకు 13 వేల 11 కోట్ల బకాయిలు ఉన్నట్లు స్పష్టం చేశాయి. డిస్కమ్‌లు 28 వేల 599 కోట్ల మేర నష్టాల్లో మునిగిపోయాయని వెల్లడించాయి. బకాయిలు చెల్లించాలని కోరుతూ విద్యుత్ సరఫరా సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో..డిస్కమ్‌లు తమ ఆర్థిక కష్టాలను ఏకరవు పెట్టాయి. గత మూడేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థలు బలోపేతమయ్యాయంటూ సీఎం జగన్‌ బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. అందుకు విరుద్ధంగా న్యాయస్థానంలో డిస్కమ్‌లు అఫిడవిట్ వేయడంతో ఎవరి మాట నిజమనే సందేహాలు తలెత్తుతున్నాయి. లాభనష్టాల్లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నామని చెబుతున్న డిస్కమ్‌లు ఒక్కసారిగా న్యాయస్థానం ఎదుట ఆర్థిక కష్టాలు వల్లె వేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బహిరంగ మార్కెట్‌లో భారీ ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేస్తూ ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న డిస్కమ్‌లకు భారీ నష్టాలు ఎందుకు వస్తున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గు, కరెంటు కొనుగోళ్లలో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు భారీ నష్టాలు వస్తున్నాయంటూనే..ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన 9 వేల 115 కోట్లు ఒకేసారి చెల్లించేందుకు ముందుకువస్తే 40 శాతం రాయితీ ఇచ్చేందుకు డిస్కమ్‌లు సిద్ధపడడం ఏంటని నిలదీస్తున్నారు.

ప్రజల నుంచి ట్రూ అప్‌ ఛార్జీల కింద...3 వేల 457 కోట్లు వసూలు చేసేందుకు సిద్ధపడిన డిస్కమ్‌లు..ప్రభుత్వ శాఖలు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే భారీ జరిమానా వేయాల్సిందిపోయి...ఏకంగా 3 వేల 646 కోట్ల మాఫీ చేసేందుకు సిద్ధం కావడం విమర్శలకు దారి తీస్తోంది. మొత్తానికి న్యాయస్థానంలో డిస్కమ్‌లు దాఖలు చేసిన అఫిడవిట్‌తో సంస్థల ఆర్థిక డొల్లతనం బయటపడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story