బిగ్ బ్రేకింగ్.. ఎన్నికలన్నీ ఒకేసారి పెట్టాలంటున్న ఏపీ ప్రభుత్వం

బిగ్ బ్రేకింగ్.. ఎన్నికలన్నీ ఒకేసారి పెట్టాలంటున్న ఏపీ ప్రభుత్వం
పంచాయతీ ఎన్నికలను ఇప్పుడప్పుడే వద్దన్న రాష్ట్ర ప్రభుత్వం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి పెట్టాలంటోంది.

పంచాయతీ ఎన్నికలను ఇప్పుడప్పుడే వద్దన్న రాష్ట్ర ప్రభుత్వం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి పెట్టాలంటోంది. ప్రభుత్వం తన ప్రతిపాదనను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ ముందు ఉంచింది. ఎన్నికలన్నీ ఒకేసారి పెట్టడం వల్ల సమయం ఆదా అవుతుందని చెబుతోంది. ప్రతి దానికి ఎన్నికల కోడ్ అడ్డు వస్తుండడం కూడా ప్రభుత్వ ప్రతిపాదనకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నిమ్మగడ్డ.

పంచాయతీ ఎన్నికలు ఈనెల 21తో పూర్తి కానున్నాయి. ఆ వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఎన్నికల సంఘం. రేషన్ వాహనాలపై రంగులు మార్చాలని ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాల్లోనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయన్న సంకేతాలు ఇచ్చారు. దీంతో మళ్లీ మళ్లీ ఆటంకాలు రాకుండా ఉండాంటే ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలని ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కోరారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం రాతపూర్వక అంగీకారం కూడా తెలిపింది. ఒకవేళ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేటట్లైతే.. అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు తెలిసింది.

నిజానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలు కూడా ఎప్పుడో జరగాల్సింది. కరోనా కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పురపాలక, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్‌ స్థానాలకు వేసిన నామినేషన్లు పరిశీలన దశలో ఉండగానే ఎన్నికలను వాయిదా వేశారు. అయితే, కొత్తగా షెడ్యూల్‌ ప్రకటిస్తారా లేదా ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెడతారా అనే దానిపై చర్చ జరుగుతోంది.

అయితే, ఆగిన చోట నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తిరిగి కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 23వ తేదీన మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అంతా సవ్యంగా సాగితే వచ్చే నెల మూడో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు కూడా పంపుతోంది ఎస్‌ఈసీ. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయాలని, కొత్త షెడ్యూల్ ప్రకటించాలని మెజారిటీ పార్టీలు ఎస్‌ఈసీని కోరాయి. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత నిర్ణయం ప్రకటిస్తామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు.

మొత్తం మీద వచ్చే నెలాఖరులోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, పురపాలక ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story