ఏపీలో ముదురుతోన్న స్థానిక ఎన్నికల వివాదం.. తెరపైకి కరోనా సెకండ్ వేవ్

ఏపీలో ముదురుతోన్న స్థానిక ఎన్నికల వివాదం.. తెరపైకి కరోనా సెకండ్ వేవ్

ఏపీలో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదం ముదురుతూనే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. కరోనా పేరుతో కుదరంటే కుదరదని ప్రభుత్వం చెబుతోంది. ఈ తరుణంలో హైకోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ సీఎస్ నీలం సాహ్నీకి నిమ్మగడ్డ మరోసారి లేఖ రాశారు. ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరో కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించనుందనే వాదనలు తెరపైకి తెచ్చింది. ఈ మేరకు వైద్య నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లనుంది. పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికే ప్రభుత్వం కరోనా సెకండ్‌ వేవ్‌పై నివేదికను తయారుచేయించిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిపేందుకు ఎస్‌ఈసీ సిద్ధమవ్వడం.. ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం.. ఎన్నికల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించడం చకచక జరిగిపోయాయి. నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ గా ఉన్నంతకాలం ఎన్నికలు జరిపేది లేదని వైసీపీ సర్కార్ తేల్చిచెప్పడం తెలిసిందే.

అయినా కానీ నిమ్మగడ్డ సీఎస్ కు మరోసారి లేఖ రాయడంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కరోనా సెకండ వేవ్ ముప్పుపై వైద్యనిపుణుల చేత నివేదిక తయారుచేయించిందని ఆరోపణలు వస్తున్నాయి. సరిగ్గా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలోనే జనవరి 15 నుంచి మార్చి 15 మధ్య సెకండ్‌ వేవ్‌ ఉంటుందని వైద్య నిపుణులు నివేదిక ఇవ్వడంపై అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.

ఒక దశలో వరుసగా 20 రోజులపాటు పది వేల కేసులు నమోదు కాగా.. ఇప్పుడు రోజుకు 300 నుంచి 500 వరకే వస్తున్నాయి. అందుకే పంచాయతీ ఎన్నికలకు నిమ్మగడ్డ సిద్దమయ్యారని అధికార వర్గాలే చెబుతున్నాయి. అయితే ఇందుకు కరోనా సాకు చూపించి రాష్ట్రప్రభుత్వం ససేమిరా అంటోందని పేర్కొంటున్నారు.

గత మార్చిలో కరోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను వాయిదావేశారు. ప్రస్తుతం నిజంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తే ఆయన ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని అధికారులే చెబుతున్నారు. ఏది ఏమైనా నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు నిర్వహించారాదన్న మొండిపట్టుదలతో ప్రభుత్వం ఉందని వెల్లడిస్తున్నారు.


Tags

Next Story