AP: విద్యుత్‌ ఉద్యోగుల పోరుబాట..సర్కార్‌కు చెమటలు పట్టిస్తున్న వైనం

AP: విద్యుత్‌ ఉద్యోగుల పోరుబాట..సర్కార్‌కు చెమటలు పట్టిస్తున్న వైనం
తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు విశాఖ, శ్రీకాకుళం, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఆందోళనలు

ఏపీలో విద్యుత్‌ ఉద్యోగులు పోరుబాట పట్టారు. సర్కార్‌కు చెమటలు పట్టిస్తున్నారు. తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దీక్షలు చేపట్టారు. విశాఖ, శ్రీకాకుళం, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే పోరు ఉధృతం చేస్తామని ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది.

విద్యుత్ ఉద్యోగుల ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో నిరసన చేపట్టారు. సర్కిల్ ఆఫీస్ ముందు మధ్యాహ్న విరామంలో ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి తప్పారంటూ మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులకు 45శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాలలో అడ్డగోలు నిబంధనలు దేనికని నిలదీశారు. పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్‌లు నెరవేరకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఏలూరులో విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ కార్యాలయం నుంచి జిల్లా విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వన్ని నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా ఒక్క అడుగు పడలేదన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చటంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని విద్యుత్‌ ఉద్యోగులు ఫైరవుతున్నారు. ఒంగోలులోని విద్యుత్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తమ సమస్యలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కిల్‌ కార్యాలయాలు, జనరేటింగ్‌ స్టేషన్లలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు.

తిరుపతిలో విద్యుత్ ఉద్యోగుల నిరసన ఉధృతమవుతోంది. తిరుపతిలో విద్యుత్ కార్యాలయం ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన విద్యుత్ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నెల 9వ తేదీ లోపు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులను విభజించి పాలించాలని చూస్తున్నారని.. అలాంటి పనులు మానుకోవాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై జగన్‌ బటన్‌ నొక్కాలని కోరారు.

Tags

Next Story