నవంబర్‌1నే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం

నవంబర్‌1నే ఆంధ్రప్రదేశ్‌ అవతరణ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం

నవంబర్‌1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాజధానిలోను, అలాగే అన్ని జిల్లాల్లోనూ నిర్వహించాలంటూ జీవో కూడా జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన TDP ప్రభుత్వం అవతరణ దినోత్సవానికి బదులు అపాయింట్‌డేగా ప్రకటించిన జూన్‌ 2న నవనిర్మాణ దీక్షలు చేపట్టేది. నవ్యాంధ్ర పునర్‌నిర్మాణానికి కట్టుబడి ఉందామంటూ ప్రతిజ్ఞ చేయిస్తూ ఈ నవనిర్మాణ దీక్షకు శ్రీకారం చూట్టారు. కానీ YCP అధికారంలోకి వచ్చాక నవంబర్‌ 1న అవతరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. అప్పుడు అక్టోబర్‌1ని అవతరణ దినోత్సవంగా జరిపేవారు. తర్వాత 1956లో తెలంగాణ, ఏపీలతో కలిపి ఆంధ్రరాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారాక నవంబర్‌ 1న అవతరణ దినోత్సవం నిర్వహించేవారు. ఇక 2014 తర్వాత TDP జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష సంప్రదాయం మొదలుపెడితే.. ఇప్పుడు YCP నవంబర్‌ 1కే కట్టుబడింది. రాష్ట్ర విభజన విషయంలో ఏపీకి న్యాయం జరగలేదన్న కారణంగానే జూన్‌2న నవ నిర్మాణ దీక్షను TDP ప్రభుత్వం మొదలుపెట్టినా.. ఇప్పుడు దాన్ని YCP మార్చేసింది. గత ఏడాది తరహాలోనే ఇప్పుడు కూడా నవంబర్ 1నే అవతరణ వేడుకలు జరపనున్నారు.


Tags

Next Story