AP: రైతులకు త్వరలో ఏపీ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే ఐదు కీలక హామీలను అమలు పరిచిన కూటమి ప్రభుత్వం మరో హామీని ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద అందించే 20 వేల రూపాయల పథకంపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని కేంద్రం ఏటా 7500 రూపాయలు అందిస్తోంది. గత ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద దీనికి మరో ఆరు వేలు కలిసి 13500 రూపాయలు ఇచ్చేది. అయితే దీన్ని 20వేలకు పెంచుతామని కూటమి పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ హామీని అమలు పరిచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అర్హులు ఎంపికతోపాటు ఇతర సమస్యలు లేకుండా చర్యలు తీసుకునే దిశగా కసరత్తు చేస్తోంది.
రైతు భరోసార పేరుతో ఉన్న పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాన్ని వీలైన త్వరగా రైతులకు అందివ్వాలని చూస్తోంది. దీని కోసం అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయనుంది. అందులో రైతుల వివరాలు పొందుపరిస్తే అర్హుల గుర్తింపు సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో 49 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందేది. కుటుంబానికి ఒక వ్యక్తికే పెట్టుబడి సాయం అందించే వాళ్లు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6534కోట్లు ఖర్చు పెట్టే వాళ్లు. అర్హులైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందివ్వాలని భావిస్తున్న వేళ ఈ ఖర్చు భారీగా పెరగనుంది. ఓ వైపు దానికి తగ్గట్టు నిధులు సమకూరుస్తూనే అర్హుల జాబితా తయారీ కోసం ప్రత్యేక విధానం తీసుకురానుంది.
రైతు పెట్టుబడి సాయం పోర్టుల్ అందుబాటులోకి వస్తే మాత్రం ముందుగా రైతుల వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం పాస్‌బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ల్యాండ్ పేపర్స్, మొబైల్ నెంబర్, ఇన్‌కం సర్టిఫికేట్ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే పోర్టల్‌లో రైతుల వివరాలు అప్‌లోడ్ చేయనున్నారు. దీని కోసం సచివాలయ సిబ్బందిని ఊళ్లకు పంపించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. జులై 22 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ లోపే విధివిధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com