ఏపీలో ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడేందుకు అలా చేశారు : విపక్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం అమలుపై వివిధ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌కు బదులు.. నగదు బదిలీ పేరుతో మీటర్లు బిగించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
వైసీపీ ప్రభుత్వం నిస్సుగ్గుగా అబద్ధాలు చెబుతోందని ట్విట్టర్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫైర్ అయ్యారు. తడిగుడ్డలతో రైతుల గొంతు కోయాలని వైసీపీ సర్కార్ చూస్తోందన్నారు. తండ్రి ఆశయాలకు కొడుకు జగన్ తూట్లు పొడుస్తున్నాడని.. స్వయంగా ఆయన సొంత మీడియా అంటోందని ట్వీట్ చేశారు. అప్పట్లో కిరణ్ సర్కార్ మీటర్లు బిగించి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుతోందని.. ఆ మీటర్లు రైతుల పాలిట యమపాశాలు కాబోతున్నాయని.. జగన్ మీడియా చక్కగా వివరించిందన్నారు. నగదు బదిలీ పేరుతో భారాన్ని రైతులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు.
డిస్కంలను ప్రవేటీకరణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని చూస్తుందన్నారు మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర్ రావు. బెయిల్ రద్దు ఆవుతుందనే భయంతోనే కేంద్రం ఏం చెప్పినా ఏపీ సీఎం జగన్ ఒప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఈ నగదు బదిలీ పథకంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు వడ్డే శోభనాదీశ్వర్రావు.
ఉచిత విద్యుత్‌కి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయడం దుర్మార్గం అన్నారు. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో బోర్లపై అధికంగా రైతులు ఆధారపడుతున్నారని.. వ్యవసాయ సంక్షోభం నుంచి బయటకు రావాలంటే ఉచిత విద్యుత్ అనేది ఒక హక్కుగా ఇవ్వాలన్నారు విశ్లేషకులు టి.లక్ష్మీనారాయణ.
విద్యుత్‌కు నగదు బదిలీ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు సీపీఐ రామకృష్ణ. రాజధాని విషయంలో ప్రజలను ఎలా మోసం చేసారో ఇప్పుడు మరోసారి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మోటర్లుకు మీటర్ల పెట్టె కార్యక్రమం డిసెంబర్ లో చేపడతామని ముఖ్యమంత్రి చెప్తున్నారన్నారు. దీంతో శ్రీకాకుళం నుండే మా విద్యుత్ ఉద్యమం ప్రారంభం అవుతుందని జగన్ సర్కార్‌ను హెచ్చరించారు రామకృష్ణ.
జీవో నెం. 22ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిపిఎం మధు డిమాండ్ చేశారు. బీజేపీ ఒత్తిడికి ముఖ్యమంత్రి పూర్తిగా లొంగిపోయారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాలకు వైసీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తోందని విమర్శించారు సిపిఎం మధు.
రాజశేఖర్ రెడ్డి పథకాల్లో గుండె కాయలాంటి పథకం ఉచిత విద్యుత్ పథకం అన్నారు కాంగ్రెస్ నేత గంగాధర్. ఆ పథకాన్ని తీసే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారని ప్రశ్నించారు.ఇది ఒక్క రైతుల సమస్య మాత్రమే కాదు ప్రజలందరి సమస్య అన్నారు. నగదు బదిలీ పథకంపై ఉద్యమానికి కాంగ్రెస్ సిద్ధమన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com