రుషికొండపై అక్రమ తవ్వకాలు..హైకోర్టుకు ఎంవోఈఎఫ్‌ నివేదిక

రుషికొండపై అక్రమ తవ్వకాలు..హైకోర్టుకు ఎంవోఈఎఫ్‌  నివేదిక
విశాఖలోని రుషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ

విశాఖలోని రుషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపినటట్లు గుర్తించింది. ఈ మేరకు నిర్మాణాలు జరుపుతున్నది వాస్తవమేనని హైకోర్టుకు నివేదిక సమర్పించింది. తమ శాఖ నుంచి పొందిన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని స్పష్టం చేసింది. ఎంవోఈఎఫ్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే భూవినియోగ విధానం, నిర్మాణ బ్లాకుల సంఖ్య, బ్లాకుల నిర్మాణ విస్తీర్ణంలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మార్పులు చేసిందని తెలిపింది. ఎంవోఈఎఫ్‌ ఇచ్చిన అనుమతులకు మించి కొండ ఎత్తుగా ఉండే వైపు తవ్వకాలు జరిపారని తెలిపింది. మొత్తం 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతిస్తే.. 17.96 ఎకరాలను పనుల కోసం వినియోగిస్తున్నారని నివేదికలో స్పష్టం చేసింది.

రుషికొండపై తవ్వితీసిన మట్టిని కొండకు దక్షిణం వైపు ఉన్న ప్రాంతాల్లో డంప్‌ చేశారని నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఏపీటీడీసీ 7 బ్లాకుల స్థానంలో నాలుగు బ్లాకులను నిర్మిస్తోందని.. 19,968 చదరపు మీటర్లలో నిర్మాణాల కోసం సీఆర్‌జెడ్‌ అనుమతులు ఉండగా 15,363 చదరపు మీటర్లలో నిర్మాణాలు జరుపుతోందని తెలిపింది. క్షేత్ర స్థాయిలో పనులను తాము పరిశీలించిన నాటికి ల్యాండ్‌ స్కేపింగ్‌, హార్డ్‌ స్కేపింగ్‌ పనులు ప్రారంభించలేదని పేర్కొంది.

రుషికొండపై నిర్మాణం కోసం వినియోగిస్తున్న స్ధలంతో పాటు కొండ వాలును చదరం చేసేందుకు, నిర్మాణ సామగ్రిని ఉంచేందుకు వినియోగిస్తున్న మొత్తం విస్తీర్ణాన్ని నిర్ధారించేందుకు రియల్‌ టైం కైనమాటిక్స్‌విధానాన్ని అనుసరించినట్లు కమిటీ తెలిపింది. ఈ ఏడాది మార్చి 13న రుషికొండపై పనులు పరిశీలించామని వెల్లడించింది. వివరాలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం నివేదికపై స్పందన తెలపాలని పిటిషనర్లను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story