ఏపీలో చీప్ లిక్కర్ అమ్మకాలపై కొత్త ఆంక్షలు!

సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వెరైటీ లిక్కర్ పాలసీలు తీసుకొస్తోంది. కొన్ని నెలలుగా లిక్కర్ రేట్లు పెంచుతూ.. తగ్గిస్తూ.. మందుబాబులపై ప్రయోగాలు చేస్తోంది. చివరికి జనంతో ఏ బ్రాండ్‌లు కొనుగోలు చేయిస్తే... సర్కార్‌కు నాలుగు రాళ్లు వస్తాయో లెక్కలేసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే... తాజాగా... చీప్ లిక్కర్ అమ్మకాలపై కొత్త ఆంక్షలు విధించినట్టు సమాచారం. మద్యం షాపుల్లో రోజుకు మూడు కేసులు మాత్రమే చీప్ లిక్కర్ అమ్మాలని నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. బార్‌లు 50 కేసులు ప్రీమియం బ్రాండ్‌లు కొంటేనే... 10 కేసుల చీప్ లిక్కర్ సరఫరా చేస్తామని రూల్స్ పాస్ చేసినట్టు అంటున్నారు. వాస్తవానికి ఏపీలోని మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ వాటా 60 నుంచి 70 శాతం ఉంటోంది.
చీప్ లిక్కర్ స్థానంలో ప్రీమియం బ్రాండ్‌లు అమ్మితే ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి అనుగుణంగానే.. పేదలు, సామాన్యులు తాగే చీప్ లిక్కర్ సేల్స్ తగ్గించి ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఏపీలోని ప్రీమియం బ్రాండ్లన్నీ వైసీపీ నేతల కంపెనీలేనని ఆరోపణలున్నాయి. ప్రీమియం బ్రాండ్ల సేల్స్ పెంచడానికే చీప్ లిక్కర్‌పై ఆంక్షలు విధిస్తున్నారని మద్యం ప్రియులు అంటున్నారు.
ఏపీలో చీప్ లిక్కర్ క్వార్టర్ 150 నుంచి 200 రూపాయలు ఉండగా.. ప్రీమియం బ్రాండ్ క్వార్టర్ 200 నుంచి 600 వరకు ఉంది. మరోవైపు ప్రీమియం బ్రాండ్‌లు కూడా చీప్ లిక్కర్‌లేనని మందుబాబు ఆరోపిస్తున్నారు. పేర్లు మార్చి తమ జేబులు గుల్ల చేస్తున్నారని అంటున్నారు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్‌లతో నాసిరకమైన లిక్కర్ అంటగడుతున్నారని మద్యం ప్రియులు అంటున్నారు. వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో లభించే బ్రాండ్‌లు ఏపీలో దొరకవని ఆవేదన చెందే మద్యం ప్రియులు కూడా లేకపోలేదని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com