అడ్డికి పావుశేరు లెక్కన ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుంటున్న వైసీపీ

అడ్డికి పావుశేరు లెక్కన ప్రభుత్వ భూములు లీజుకు తీసుకుంటున్న వైసీపీ
నాలుగేళ్ల పాలనలో పేదోడికి ఒక్క ఎకరం భూమి కేటాయించని జగన్ సర్కారు.. రాష్ట్రంలో విలువైన సర్కారు భూములని లీజు పేరుతో అత్యంత తక్కువ ధరకే వైసీపీ కార్యాలయాలకు కట్టబెట్టింది

నాలుగేళ్ల పాలనలో పేదోడికి ఒక్క ఎకరం భూమి కేటాయించని జగన్ సర్కారు.. రాష్ట్రంలో విలువైన సర్కారు భూములని లీజు పేరుతో అత్యంత తక్కువ ధరకే వైసీపీ కార్యాలయాలకు కట్టబెట్టింది. తాజాగా కర్నూలులో కోట్లు విలువ చేసే సర్కారు భూమిపై తమ పార్టీ కార్యాలయం లీజ్‌కు తీసుకున్నారు వైసీపీ నేతలు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. లీజు పేరుతో అత్యంత రహస్యంగా ఈ బదలాయింపు జరిగింది. అంతేకాదు గుట్టుచప్పుడు కాకుండా పూజలు చేసి పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులూ చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు.

కర్నూలు సిటీ సెంటర్ ఆర్ ఎస్ రోడ్ లో 1.60 ఎకరాల ఏపీఆగ్రోస్ కి చెందిన సర్కారు భూమి గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. దీనిపై వైసీపీ నేతలు కన్నేశారు. బహిరంగ మార్కెట్ లో 80 కోట్లు విలువ చేసే ఈ సర్కారు స్థలం.. వైసీపీ కార్యాలయానికి అప్పనంగా బదలాయింపు చేసేసుకున్నారు. 1.60 ఎకరాల విలువైన భూమిని కేవలం ఏడాదికి 1600 రూపాయల చొప్పున 33 ఏళ్లపాటు వైసీపీకి లీజుకు కట్టబెట్టేసింది ప్రభుత్వం.ఈ ఏడాది ఫిబ్రవరి 16 న ఆగ్రోస్ స్థలం బదలాయింపు చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ద్వారా జీవో నెంబర్ 55 ను ఏపీ సర్కారు విడుదల చేసింది. ఈ వ్యవహారం బయటికి వస్తే.... వివాదమవుతుందని జీవో విడుదలను అత్యంత గోప్యంగా ఉంచారు. ఆగ్రోస్ స్థలం బదలాయింపులో కొంతమంది రెవెన్యూ అధికారులు అత్యంత ఉత్సాహం చూపి కీలక పాత్ర పోషించినట్ల వైసీపీ క్యాడర్లో చర్చ సాగుతోంది. ఆగ్రోస్ సంస్థ ప్రమేయం లేకుండానే ఈ భూమిని బదలాయింపు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసినా ఆగ్రోస్ అధికారులు తెలియనట్లు సైలెంట్‌గా ఉండిపోవడం విశేషం.

పార్టీ ఆఫీస్ కోసం కర్నూలు నగరంలో నాలుగు చోట్ల విలువైన సర్కారు భూములను పరిశీలించారు వైసీపీ నేతలు.టీడీపీ జిల్లా కార్యాలయం సిటీలో ఉండగా వైసీపీ ఆఫీస్ ఊరిశివారులో కాకుండా సిటీలో నే ఉండాలని పట్టుబట్టారు వైసీపీ నేతలు. ఇందులో భాగంగానే ఆగ్రోస్ స్థలాన్ని దక్కించున్నట్లు చర్చ సాగుతోంది. కర్నూలు రైల్వేస్టేషన్ సమీపంలో.. ఆర్ఎస్ రోడ్ సర్కిల్ లో సెంట్ స్థలం బహిరంగ మార్కెట్ విలువ 50 లక్షల రూపాయలకు పైగానే ధర ఉంది. ఈ లెక్క ప్రకారం ఈ 1.60 ఎకరాల స్థలం విలువ దాదాపు 80 కోట్లు పైగా ధర పలుకుతుంది. ఎంతో విలువైన ఈ స్థలాన్ని ఎకరానికి వెయ్యి ప్రకారం 1.60 ఎకరాలకు 1,600 రూపాయలకే 33 ఏళ్లు వైసీపీ ఆఫీసుకు లీజుకు ఇచ్చేసింది ఏపీ సర్కారు.

ఇదే స్థలాన్ని గతంలో క్రాఫ్ట్ బజార్, వస్త్ర మాల్ కి నెలకు లక్ష చొప్పున అద్దెకు ఇచ్చారు ఆగ్రోస్ అధికారులు. నగరంలో స్థలం లీజు నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకూ అద్దెలు పలుకుతున్నాయి. అలాంటిది ఏడాదికి కేవలం 1600 రూపాయలకే లీజు కి కట్టబెట్టడం తీవ్ర విమర్శల కు తావిస్తోంది. అంతేకాదు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వైసీపీ ఆఫీసు భవన నిర్మాణానికి తీర్మానం ఆమోదం తెలపడం కొసమెరుపు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేరుతో ఆగ్రోస్ స్థలం 33 ఏళ్ళు లీజుకు కేటాయించేశారు. ఈ విషయం బయటికి పొక్కకుండా ఆగ్రోస్, రెవెన్యూ శాఖ, వైసీపీ నేతలు గోప్యత పాటించారు. అంతేకాదు.... గుట్టుచప్పుడు కాకుండా ఇటీవలే మేయర్ ,పార్టీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య పూజలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఫోటోలు దిగితే విషయం వైరల్ గా మారి పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఆటంకం కలుగుతుందని.... ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని సమాచారం. త్వరలోనే పార్టీ ఆఫీస్ నిర్మాణ పనులకు రెడీ అవుతున్నారు వైసీపీ నేతలు

మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో 2012 మార్చి 30న ఈ స్థలాన్ని ఏపీ ఆగ్రోస్‌ సంస్థ......... 33 ఏళ్ల లీజుకు ఇచ్చిందని నెల్లూరు చెందిన ఎస్వీ ఇంజనీరింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన లీజ్‌ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. ఏడాది 29.04 లక్షలు లీజు చెల్లించేలా ఒప్పందంలో రాసుకున్నారు. ఏడాదిలో రెండు పర్యాయాలు లీజు మొత్తం చెల్లించాల్సి ఉంది. ఒప్పందం ప్రకారం ఇంకా 11 ఏళ్లు గడువు లీజు గడువు ఉంది. దీనిని రద్దు చేయకుండానే వైసీపీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని ప్రతిపక్షపార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాలుగేళ్ళ పాలనలో ఒక్క ఎకరా భూమి పేదలకు పంచని జగన్ సర్కారు........ కోట్లు విలువ చేసే సర్కారు భూమిని వైసీపీ కార్యాలయానికి బదలాయింపు చేయడం ఏంటని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ సర్వసభ్య సమావేశంలో పలువురు కార్పొరేటర్లు... మేయర్ బీవై రామయ్య ను నిలదీశారు. దీనిపైన న్యాయ పరంగా పోరాడుతామంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర అధికారులు స్పందించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story