AP High Court: సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

AP High Court: సంక్షేమ హాస్టళ్లలో బెడ్ల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏటువంటి సమాజంలో బతుకుతున్నాం అంటూ ఆగ్రహం

సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు నేలపైనే పడుకోవడాన్ని నిరసిస్తూ...ఇలాంటి పరిస్థితులు ఉంటే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. విద్యార్థులు పడుకోవడానికి మంచం, పరువు అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల లేమిపై రాష్ట్ర హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులు పడుకోవడానికి కనీసం మంచం, పరువు సౌకర్యం కల్పించకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత కాదా అంటూ...ఇలాంటి పరిస్థితులు ఉండే మన పిల్లల్ని అక్కడ చేరుస్తామా అంటూ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం. ఇలాంటి పరిస్థితులు చాలా దురదృష్టకరం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సాంఘింక సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పేద విద్యార్థులే చదువుతుంటారని, ఇతరులతో సమానంగా వారికి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టంచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 190 గురుకుల పాఠశాలల్లో లక్షా 70 వేల మంది విద్యార్థులకు మంచాలు, నాణ్యమైన పరుపులు ఇచ్చే వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని గోడి గ్రామంలో సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, వసతి గృహంలో అసౌకర్యాలపై సామాజిక కార్యకర్త బాజ్జి దాఖలు చేసిన పిల్‌పై విచారణ జరిపిన హైకోర్టు..కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులకు మంచాలు, పరుపులు లేక కిందే పడుకుంటున్నారని...కనీసం దుప్పట్లు అందించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ...వసతుల మెరుగుపరిచేందుకు నిధులు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు తెలిపారు. గోడి వసతి గృహానికి కేటాయించిన 84లక్షల నిధులను సరైన మార్గంలో వినియోగించాలని ఇంజనీర్లను హైకోర్టు ఆదేశించింది. పనులన్ని పూర్తయ్యాక హైకోర్టు సీనియర్‌ అధికారి పనులను పరిశీలిస్తారని, లోపాలేమైనా ఉంటే ఆ ఇద్దరు ఇంజనీర్లు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. ఇదే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు మంచాలు, పరుపులు ఇచ్చే విషయంపై తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచాలని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఆదేశించింది

Tags

Read MoreRead Less
Next Story