మూడు రాజధానుల వ్యవహారంపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ..!

రాజధాని వ్యవహారంపై ఇవాళ నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను ఇవాళ విచారించనుంది.
రాజధాని పిటిషన్లపై ఈ ఏడాది మార్చి 26న మొదటిసారి విచారణ జరిపిన ధర్మాసనం.. ఆ తరువాత మే 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ఆ సమయంలో కరోనా విజృంభిస్తున్నందున న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఆగస్ట్ 23కు విచారణను వాయిదా వేసింది. రాజధాని పిటిషన్లపై ఇవాళ్టి నుంచి రోజువారీ విచారణ జరగబోతోందని రాజధాని రైతులు చెబుతున్నారు.
ఏపీ హైకోర్టులో రాజధాని పిటిషన్లపై విచారణ సందర్భంగా తమకే విజయం దక్కాలంటూ అమరావతి రైతులు న్యాయ దేవతకు పూజలు చేశారు. మందడంలో ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహానికి రైతులు, మహిళలు క్షీరాభిషేకం చేసి, హారతిచ్చారు. న్యాయదేవత తమను కాపాడుతుందంటూ నినాదాలు చేశారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని నిర్మాణానికి అంగీకరించిన జగన్.. స్వార్థ రాజకీయాల కోసం రాజధానికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం బలి పశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు అమరావతిలో రాజధాని రైతుల పోరాటం కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధానిలో 614 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పెదపరిమి, దొండపాడు, మోతడక, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, రాయపూడి, బోరుపాలెంలో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని సమస్య 29 గ్రామాలకే పరిమితం కాదని, అమరావతిని కాపాడుకోవడం రాష్ట్ర ప్రజలందరి తక్షణ కర్తవ్యమని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com