సర్పంచ్ హక్కులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

సర్పంచ్ హక్కులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గ్రామ సచివాలయ భవనాలలో సర్పంచ్, వార్డు సభ్యుల పేరిట శిలాఫలకాల ఏర్పాటుపై ప్రభుత్వ అధికారుల జోక్యం ఉండరాదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ సర్పంచ్ , వార్డు మెంబర్ల పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయడాన్ని అధికారులు రాజకీయ కారణాలతో అడ్డుకుంటున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏనుగువానిలంక సర్పంచ్ ఈద ప్రమీల దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించింది. దళిత సర్పంచ్ అయిన తన పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేయడాన్ని.. మంత్రి అండతో అధికారులు అడ్డుకుంటున్నారని పిటిషనల్ పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. సర్పంచుల అధికారాలను, శిలాఫలకాల ఏర్పాటును అధికారులు, రాజకీయ నాయకులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. గ్రామ పరిపాలన విషయంలో సర్పంచ్, వార్డు సభ్యుల అధికారాలను రాజకీయ నాయకులు కట్టడి చేయలేరని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సుదీర్ఘమైన తీర్పును వెల్లడించింది. సర్పంచ్, వార్డు సభ్యుల అధికారాలలో రాజకీయ నాయకుల జోక్యం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. సర్పంచ్, వార్డు మెంబర్లు తమ పేరిట శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. పిటిషన్, వార్డు సభ్యుల పేర్లతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసుకుంటే అధికారులు అడ్డుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com