Ap High Court: ద్విచక్ర వాహనదారులుహెల్మెట్ ధరించాల్సిందే

హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని..తీవ్రంగా పరిగణించాలని తేల్చిచెప్పింది. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా మరణాలకు కారణమని న్యాయవాది తాండవ యోగేశ్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, పోలీసులు తనిఖీలు చేసే సమయంలో బాడీ కెమెరా ధరించడం కూడా తప్పనిసరని పేర్కొన్నారు. చాలా మంది యువత జుట్టు పాడవుతుందని, సౌకర్యంగా ఉండబోదని హెల్మెట్లు ధరించకుండానే బైకులు నడిపిస్తుంటారు. ప్రమాదం జరిగితే హెల్మెట్ రక్షిస్తుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడిపితే తలకు దెబ్బలు తగలకుండా చూసుకోవచ్చు. అయినప్పటికీ చాలా మంది కోరి ప్రమాదాలను తెచ్చుకుంటున్నట్లు వ్యవహరిస్తున్నారు.
గణాంకాల ప్రకారం.. 2022లో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదాల్లో 3,703 మరణాలు సంభవించాయని, ఇందులో 3,042 మంది హెల్మెట్ ధరించకపోవడంతో సంభవించినవేనని వివరించారు. నిబంధనల ప్రకారం వాహనదారులు, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... విజయవాడలో వాహనదారులు హెల్మెట్ ధరించకుండా తిరగడాన్ని తామూ గమనించామని, విస్తృత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టనిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com