రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణ ఈనెల 9కి వాయిదా

రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణ ఈనెల 9కి వాయిదా
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు..

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై జనవరిలో శాసనమండలిలో జరిగిన చర్చలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈనెల 9వ తేదీ నాటికి పూర్తి వివరాలు, సీడీలు సీల్డు కవర్‌లో న్యాయస్థానానికి అందజేయాలని స్పష్టం చేసింది. అమరావతికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో రోజు వారీ విచారణ మొదలైంది..మొదటి రోజు 15 పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాజధాని వ్యాజ్యాల అనుబంధ పిటిషన్లపై విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది. అన్ని కేసులపై స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం వెల్లడించింది.

క్యాంపు కార్యాలయం విషయమై హైకోర్టులో ఆసక్తికరమైన చర్చ జరిగింది. క్యాంపు కార్యాలయాలు ఎక్కడైనా ఉండొచ్చని అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదించగా.. అవసరం లేకుండా నిర్మించినదాన్ని క్యాంపు కార్యాలయంగా భావించాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. క్యాంపు కార్యాలయ ఏర్పాటుకు సంబంధించిన నిబంధన సీఆర్‌డీఏ చట్టంలో ఉందా అని అడిగింది. సీఎం పనులను పరిమితం చేయొద్దని ఏజీ అనగా.. తామేమీ పరిమితం చేయడం లేదని ధర్మాసనం పేర్కొంది. అయితే సీఎం క్యాంపు ఆఫీసుపైనా స్టేటస్‌కో ఉత్తర్వులు వర్తింపజేయడంపై అభ్యంతరం ఉందన్నారు ఏజీ. రాజధాని పరిధిలోనే క్యాంపు కార్యాలయం ఉండాలనేమీ లేదన్నారు. సీఎం నెల్లూరు లేదా తిరుపతిలో కార్యాలయం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్ట నిబంధనల ప్రకారం సీఎం క్యాంపు ఆఫీసు తరలింపుపై నిషేధం లేదన్నారు. ఈ వ్యవహారంపై ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. అవసరం లేకుండా నిర్మించిన దాన్ని క్యాంపు ఆఫీసుగా భావించాలో లేదో స్పష్టత ఇవ్వాలంది. పాలనా వికేంద్రీకరణ చట్టం కంటే ముందు ప్రస్తుతం ఉన్న సీఎం ఆఫీసు కాకుండా రాష్ట్రంలో ఇంకేమైనా క్యాంపు కార్యాలయాలున్నాయా అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై విచారణను శుక్రవారానికి వాయిదే వేసింది హైకోర్టు.

Tags

Next Story