మీకు విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయండి : ప్రభుత్వంపై హైకోర్టు కన్నెర్ర

మీకు విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయండి : ప్రభుత్వంపై హైకోర్టు కన్నెర్ర
ఆంధ్రప్రదేశ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. మీకు విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయండి అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది..

ఆంధ్రప్రదేశ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. మీకు విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయండి అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. పదే పదే జగన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా మార్పు రాకపోవడంతో ఇలా మండిపడింది. రూల్‌ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా? అయితే పార్లమెంట్‌కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగండంటూ ఘాటైన వ్యాఖ్యలే చేసింది.

న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించేది లేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టును అపకీర్తి పాలుజేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అభ్యంతరకర పోస్టింగుల వెనుక కుట్ర ఏమైనా దాగుందా లేదా అనేది తేలుస్తామని చెప్పింది. ఎవరి ప్రభావం లేకుండా సాధారణంగా న్యాయమూర్తులను ఎవరూ దూషించరని అభిప్రాయపడింది. జడ్జీలను అవమానిస్తారా అని కన్నెర్ర చేసింది.

రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదా? రూల్‌ ఆఫ్‌ లా అమలుకాకపోతే.. ఇతర నిబంధనల ప్రకారం మేము అధికారాన్ని వినియోగిస్తాం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపై ఉందని, ఈ తరహా పోస్టింగులను అనుమతించొద్దని సామాజిక మాధ్యమ కంపెనీల తరఫు సీనియర్‌ న్యాయవాదులకు సూచించింది. ప్రజాస్వామ్యంలో ఇతరులను కూడా గౌరవించాలని తెలిపింది. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో హైకోర్టే వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేసింది. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించింది.

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడేందుకు తమ వంతు సహకారం, సలహాలు ఇస్తామని సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య తదితరులు కోర్టుకు తెలిపారు. కేసుల నమోదుకు సంబంధించి సీఐడీ వేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించేందుకు విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story