ఏపీలో 2019 ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు

2019 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్, ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషనర్లు కోర్టును కోరగా.. ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు జరిగాయి.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పస్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో 2019 ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఏపీ పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట సమయానికి ఓటర్ల జాబితా అందుబాటులో లేనప్పుడు అప్పటికే ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు కూడా తేల్చిచెప్పిందని పేర్కొంది.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తాజా ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడంతోనే ఎస్‌ఈసీ గత జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తోందని తెలిపింది. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేలా జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గుర్తుచేస్తూ పిటిషన్లను డిస్మిస్ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్‌పకుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
2021 ఓటర్ల జాబితాతో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విశాఖకు చెందిన ఆలివర్ రాజురాయ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమంటూ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల మరో పిటిషన్ వేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేసింది. సవరించిన జాబితా సిద్ధంగా లేనప్పుడు అప్పటికే సిద్ధంగా ఉన్న పూర్వపు జాబితాను పరిగణనలోకి తీసుకోవచ్చని అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు విపించారు. కిషన్‌సింగ్ తోమర్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని.. పిటిషనర్లు చాలా ఆలస్యంగా కోర్టుకు వచ్చారని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ హరినాథ్ అన్నారు.
ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ..2021 ఓటర్ల జాబితా తయారీ అంశంలో రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోవడంతో 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోజాలవని చెప్పారు. అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లు చట్టం ముందు నిలబడవంటూ కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com