ఫిబ్రవరిలో ఎన్నికలు జరగకుండా ఏపీ సర్కార్ మరో ఎత్తుగడ!

ఫిబ్రవరిలో ఎన్నికలు జరగకుండా ఏపీ సర్కార్ మరో ఎత్తుగడ!

ఎటు తిరిగి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలనే ఆలోచనలోనే ఉంది ఏపీ ప్రభుత్వం. నిమ్మగడ్డ రమేశ్‌పై బహిరంగ నిరసనలు తెలుపుతూనే.. ఒక్కో అడ్డంకి సృష్టిస్తూ వస్తోంది. చివరికి కోర్టులు తప్పు పట్టినా సరే.. మొండిగానే వెళ్లాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. తాజాగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో మరో ఎత్తుగడ వేసింది ప్రభుత్వం. కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు.. ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకునే విధంగా చట్టంలో మార్పులు తీసుకురాబోతోంది. ఓ విధంగా మా ఎన్నికలు మా ఇష్టం అంటోంది ఏపీ ప్రభుత్వం.

ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం-1994కు సవరణలు చేయాలని తీర్మానించింది. ఈ తీర్మానం ఆధారంగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే.. రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్వయంప్రతిపత్తిని కోల్పోయి డమ్మీగా మారిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. నిజానికి ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై పూర్తి అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. రాజ్యాంగంలోనూ ఇదే ఉంది. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కాని, ఏపీ ప్రభుత్వ మాత్రం తమ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరగాలన్నది తమ ఇష్ట ప్రకారమే ఉండాలని చెబుతోంది.

ఒకప్పుడు దేశంలో ఇదే పరిస్థితి ఉండేది. స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెట్టుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉండేది. అయితే, స్థానిక సంస్థలకు ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ రాజ్యాంగ సవరణలు చేశారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే.. ఎన్నికలు ఎప్పుడు, ఎన్ని రోజుల పాటు పెట్టాలనే నిర్ణయాధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. కాని, ఈ విధానాన్ని మార్చేయాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. కరోనాను సాకుగా చూపిస్తూ, ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారాన్ని తమ వద్దే పెట్టుకోవాలనుకుంటోంది జగన్ సర్కార్.

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుంటోంది జగన్ ప్రభుత్వం. తెలంగాణలోనూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అంగీకారం ప్రకారమే స్థానిక ఎన్నికల తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాలి. కానీ, ఏపీలో మాత్రం అలాంటి వెసులుబాటు లేదు. అందుకే, ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై ఓ తీర్మానం చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటోంది జగన్ ప్రభుత్వం. అయితే, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలో చేసిన మార్పులు రాజ్యాంగపరంగా, న్యాయపరంగా చెల్లవని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు కోర్టుకెళ్లారు. రేప్పొద్దున ఏపీలో తీసుకొచ్చే ఆర్డినెన్స్ విషయంలోనూ కోర్టుకెళ్తే.. ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తప్పదని చెబుతున్నారు.

ప్రభుత్వం తీసుకురాబోతున్న ఆర్డినెన్స్‌ను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నారు నిమ్మగడ్డ రమేశ్. ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారాలను, స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే అవకాశముందని గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story