ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ పిటీషన్‌పై విచారణ

ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ పిటీషన్‌పై విచారణ

ఏపీ స్థానిక సంస్థల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఏపీ ఎస్ఈసీ దాఖలు చేసిన విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ పిటిషన్‌పై సుధీర్ఘమైన విచారణ సాగింది. ఎస్‌ఈసీ తరపున న్యాయవాది ఆదినారాయణ వాదనలు వినిపించగా.. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్‌ వాదించారు.కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని ఏజీ శ్రీరామ్‌ కోర్టును కోరారు. వ్యాక్సినేషన్‌ వివిధ దశల్లో జరుగుతోందని, ఈ ప్రక్రియలో 23 శాఖలు పాల్గొన్నాయని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో ఎన్నికలు రద్దు చేయాలని పంచాయతీ శాఖ కార్యదర్శి ఎస్‌ఈసీకి లేఖ రాశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగింది..కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎలా జరుగుతోందని ప్రశ్నించింది. రోజుకు ఎంతమందికి వ్యాక్సిన్‌ వేస్తున్నారని.. వేసే వారికి శిక్షణ ఇచ్చారా అని ఏజీని ప్రశ్నించింది.. అన్నిటికీ సంబంధించి డాక్యుమెంట్ల వారీగా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అటు ప్రభుత్వ వాదనను వ్యతిరేకించారు ఎస్ఈసీ తరుపు న్యాయవాది. ఎన్నికలకు కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఎంత మాత్రం అడ్డు రాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఈ నెల 8వ తేదీన ఏపీలో స్థానిక సంస్థల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రద్దు చేస్తూ ఈ నెల 11వ తేదీన ఆదేశించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ అదే రోజున ఏపీ ఎస్ఈసీ డివిజన్ బెంచ్ ధర్మాసనం ముందు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. ఏపీ హైకోర్టు ఆదేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లినట్టుగా ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు కూడా ప్రభుత్వానికి సూచించిన విషయాన్ని ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మంగళవారం మరోసారి వాడివేడి వాదనలు జరిగే అవకాశాలున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story