పంచాయతీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సర్కారు మధ్య వివాదం!

ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో.. అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ సర్కారు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎస్‌ఈసీ నిర్ణయంపై ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది జగన్ సర్కారు. పిటీషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. అటు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సైతం.. తన వాదనకు కట్టుబడి ఉన్నారు. అయితే.. రాజ్యాంగ బద్ద సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయమే ఫైనల్ అంటున్నారు న్యాయనిపుణులు. సుప్రీంకోర్టు సైతం ఇలాంటి తీర్పు ఇచ్చిందంటున్నారు న్యాయనిపుణులు. దీనికి కేరళను ఉదహరిస్తున్నారు. కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ గత నెల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ, ఎన్నికల వాయిదాకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం.
అటు..బీహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదా విషయంలోనూ ఇలాగే జరిగింది. పాట్నా హైకోర్టు అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చింది. ఇవన్నీ తెలిసి కూడా ఏపీ ప్రభుత్వం మొండిగా హైకోర్టుకు వెళ్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పంచాయితీ ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకనే సీఎం జగన్ ఈ నాటకం ఆడుతున్నారని విమర్శించారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసాన్ని అడ్డుకోవాలని, శాంతియుతంగా పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయన్నారాయన. అందుకే ఏపీ పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించకూడదని తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్‌ఈసీ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిందేనన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. రాజ్యాంగ సంక్షోభానికి దారితీయొద్దని హితవు పలికారు. ప్రభుత్వ అధినేత ఒకవైపు.. సీనియర్ ఐఏఎస్ అధికారి మరోవైపు.. వీళ్లిద్దరి మధ్యా యుద్ధం జరుగుతున్నట్లుగా వర్ల రామయ్య అభివర్ణించారు.
ఒకసారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కాదనే హక్కు ఎవరికీ లేదున్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. ఎన్నికల సంఘాన్ని సీఎం జగన్ ఛాలెంజ్ చేయడం సరికాదన్నారు. గతంలోనూ ఎస్‌ఈసీని తొలగించే ప్రయత్నాన్ని కోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు.
ఓ వైపు విపక్షాలన్నీ ఎస్‌ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. ఆశ్చర్యంగా ఏపీ ఎన్జీవోల సంఘం మాత్రం వ్యతిరేకించడం విశేషం. అవసరమైతే కోర్టుకు వెళ్తామంటున్నారు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికలను వాయిదా వేయాలని రెండు నెలల నుంచే కోరుతున్నామని, ప్రభుత్వానికి బాకా ఊదాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. కమిషన్ మొండిగా వెళ్తే ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పంచాయతీ ఎన్నికల విషయంలో ఉద్యోగ సంఘాల తీరును, ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. కేవలం నిమ్మగడ్డపై వ్యతిరేకతతో ఎన్నికలు వాయిదాకి పట్టుబట్టడం సరికాదని అన్నారు.
ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కరం లభిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com